Thursday, January 23, 2025

వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడిద్దాం: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో ఈద్ నమాజ్ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె బిజెపిని తీవ్రంగా విమర్శించారు. విద్వేష రాజకీయాలు చేస్తూ కొందరు ప్రజలను చీలుస్తున్నారని ఆమె అన్నారు. అవసరమైతే తన జీవితాన్ని ఇవ్వడానికైనా సిద్ధమేనని, కానీ దేశాన్ని చీల్చడాన్ని మాత్రం అనుమతించబోనని అన్నారు.

‘మేము బెంగాల్‌లో శాంతిని కోరుకుంటున్నాము. దేశం ముక్కలు కావాలని కోరుకోవడంలేదు. కొందరు దేశాన్ని చీల్చాలని చూస్తున్నారు. ఈ ఈద్ నాడు నేను హామీ ఇస్తున్నాను. నా జీవితాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధమే కానీ దేశాన్ని ముక్కలు కానివ్వను’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాషాయ వర్గం దేశ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సిని అమలు కానివ్వను’ అని ఆమె తెలిపారు.

‘నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. శాంతియుతంగా ఉండండి. ఎవరి చెప్పుడు మాటలు వినకండి. నేను ఓ గద్దర్ పార్టీతో పెట్టుకుంటున్నాను. నేను దర్యాప్తు సంస్థలతో కూడా పోరాడుతున్నాను. నాకు ధైర్యం ఉంది కనుకే పోరాడుతున్నాను. నేనేమి లొంగిపోను’ అని మమతా బెనర్జీ అన్నారు. ‘నేను మనీ పవర్‌తో(రాజకీయ ప్రతిపక్షం), కేంద్ర దర్యాప్తు సంస్థలతో పోరాడుతున్నాను, కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు’ అని తెలిపారు.

‘కొందరు బిజెపి నుంచి డబ్బు తీసుకుని ముస్లిం ఓట్లను చీలుస్తామంటున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం గడువు ఉంది. ఎవరు ఎన్నికవుతారు, ఎవరు కారనేది చూడండి’ అన్నారు. ‘మనమంతా ఒక్కటై విచ్ఛినకర శక్తులను ఎదురిద్దాం. వారిని ఓడించి అధికారం నుంచి తొలగిద్దాం. మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకుంటే అన్నింటినీ పోగొట్టుకుంటాం’ అని మమతా బెనర్జీ తెలిపారు. ‘ఒకవేళ ప్రజాస్వామ్యం నశిస్తే, అన్నీ నశిస్తాయి. నేడు రాజ్యాంగాన్నే మార్చేస్తున్నారు. దాంతో చరిత్ర కూడా మారిపోగలదు. వారు ఎన్‌ఆర్‌సి తెచ్చారు. దానిని నేను ఆమోదించబోనని వారికి తెలిపాను’ అని కూడా ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News