Monday, November 18, 2024

నిజంగానే నేనో పెద్ద గాడిదనే: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

నిజంగానే నేనో మొద్దు గాడిదనే..ఎన్నికల సభలో మమత బాధ
సువేందు అధికారి కుటంబంపై ఆగ్రహం
ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు, జమీందార్ల తరహాపై నిప్పులు

The BJP is big looter:Mamata Banerjee

కాంతిదక్షిణ్ (పశ్చిమ బెంగాల్): తానో మూర్ఖత్వపు గాడిదను అని పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీ తనను తాను నిందించుకున్నారు. స్థానికంగా ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మమత మాట్లాడారు. పూర్బా మెధినిపూర్ జిల్లాలోని పలుకుబడి గల సువేందు అధికారి కుటుంబ నిజస్వరూపాన్ని తేలుసుకోలేకపొయ్యానని అన్నారు. ఈ విధంగా తానో గాడిదనే అన్నారు. మామూలు గాడిదను కానని పెద్ద కంచర గాడిదనే అని తనను తాను తిట్టుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి, మమత బెనర్జీ మధ్య అసెంబ్లీ స్థానపు పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందటి వరకూ అధికారి మమత పార్టీ టిఎంసిలో తిరుగులేని నేతగా ఉంటూ వచ్చారు. ఇటీవలే బిజెపిలో చేరి, కీలకమైన నందిగ్రామ్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా ఉన్నారు. తన వెంట తిరిగిన అధికారి కుటుంబ నిజస్వరూపం తనకు చాలా కాలం వరకూ తెలిసిరాలేదని, ఈ విషయంలో తాను వైఫల్యం చెందానని ఎన్నికల సభలో మమత తెలిపారు.

అధికారి కుటుంబం రూ 5000 కోట్ల విలువైన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుందని వదంతులు వింటూ వస్తున్నానని అన్నారు. ఇది ఇప్పటికీ కనుక్కోలేని తాను ఓ పెద్ద గాడిద(అమి ఏక్‌తా బోరో గథా)ను అని వ్యాఖ్యానించారు. అధికారి కుటుంబం బాగా సంపన్నంగా విస్తరించుకుందని తెలిసిందని, వేల కోట్ల డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తారని అంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడి ప్రజలు డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. జిల్లాలో అధికారి కుటుంబానికి దండిగా రాజకీయ ప్రాబల్యం ఉంది. వీరిలో అత్యధికులు బిజెపిలో చేరారు. కొందరు ఎన్నికల దశలో టిఎంసికి వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. అధికారి వ్యవహారంపై తాను తిరిగి అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి తీరుతానని చెప్పారు. సువేందు తండ్రి, టిఎంసికి చెందిన ప్రముఖ ఎంపి సిసిర్ అధికారి ఆదివారం ఎగ్రాలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న సభలోనే బిజెపిలో చేరారు. ఇది మమతకు మరింత షాక్ ఇచ్చింది. అధికారి కుటుంబం విద్రోహ చర్యల మీర్ జాఫర్ బాపతు అని, ఇటువంటి వారిని ఇక్కడి ప్రజలు సహించబోరని తిప్పికొడుతారని తేల్చిచెప్పారు.

బిజెపి రాజకీయ పార్టీ కాదని, ఇది గూండాలు, వెధవల కూటమి అన్నారు. ఈ ప్రాంతాన్ని అధికారి కుటుంబం జమీందార్ల మాదిరిగా ఏలుకుంందని, పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుందని, అంతా వారి ఇష్టారాజ్యం అయిందన్నారు. చివరికి తన ఎన్నికల సభలను కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభలకు అనుమతి లేకుండా చేయిస్తున్నారని తెలిపారు. ఇక్కడ పలు విధాలైన ప్రగతి పనులు కేవలం రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో చేపట్టినవే అని, అధికారి కుటుంబపు దయా దాక్షిణ్యాలతో జరిగినవి కావన్నారు. బెంగాల్‌లో బిజెపి ప్రవేశాన్ని ప్రజాశ్రేణులు అడ్డుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రగతి పంథా కొనసాగింపునకు ఇది అత్యవసరం అన్నారు. ఇంతకాలం ఆయన టిఎంసిలో ఉంటూ వచ్చినందున గుడ్డిగా నమ్ముతూ వెళ్లానని తెలిపారు. ఎన్నికల ప్రసంగం ముగింపు సందర్భంగా ఆమె వందేమాతరం, జై హింద్ నినాదాలతో జాతీయవాదపు కార్డు వాడటానికి యత్నించారు. నందిగ్రామ్ స్థానంలో ఎన్నికల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Mamata Banerjee blames her self

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News