అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్
పైలాన్(పశ్చిమ బెంగాల్): వారసత్వ రాజకీయాలపై తనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న విమర్శలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ముందు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత తనతో పోరాడే విషయం గురించి ఆలోచించాలని ఆమె అమిత్ షాకు సవాలు విసిరారు. గురువారం 24 పరగణాల జిల్లాలోని పైలాన్‌లో ఒక బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపి కావాలంటే సులువుగా రాజ్యసభ దారిని ఎంచుకోవచ్చని, కాని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడని అన్నారు. రాత్రీ పగలు దీదీ-మేనల్లుడి గురించే వాళ్లు మాట్లాడుతున్నారు.
అమిత్ షాకు సవాలు చేస్తున్నా.. ముందు అభిషేక్ బెనర్జీతో ఎన్నికల్లో పోటీ చేసి గెలువ్..ఆ తర్వాత నా గురించి ఆలోచిద్దువు కాని అంటూ మమత మండిపడ్డారు. తన మేనల్లుడికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, ఏదో ఒక రోజు అతడిని తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తానంటూ అమిత్ షాతో సహా ఇతర బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొడుతూ క్రికెట్ బోర్డులో మీ కుమారుడు ఎలా చేరి వందలాది కోట్లు ఎలా సంపాదించాడని ఆమె అమిత్ షాను ప్రశ్నించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.