గుజరాత్, రాజస్థాన్‌ల్లోనూ ఇలాంటివే జరిగాయి
బీర్‌భూమ్ ఘటనపై మమతాబెనర్జీ వ్యాఖ్య
కోల్‌కతా : బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్‌లో కూడా చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘనలను ఏమాత్రం సమర్ధించడం లేదని, పూర్తి పారదర్శకతతోనే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. “బీర్భూమ్, రాంపూర్‌హట్‌లో జరిగిన సంఘటనలు అత్యంత దురదృష్టకరం. వెంటనే ఓసీ, ఎస్‌డీపీఓ అధికారులను డిస్మిస్ చేస్తున్నారు. రేపు రాంపూర్‌హట్‌కు నేను వెళ్తున్నాను.” అంటూ మమత ప్రకటించారు. సంఘటన స్థలాన్ని బీజేపీ నేతలు సందర్శించడంపై దీదీ స్పందించారు. ఇది బెంగాల్. యూపీ కాదు. హాథ్రస్ ఘటన నేపథ్యంలో తృణమూల్ నేతలు అక్కడికి వెళ్లగా, పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. కానీ మేమలా చేయడం లేదు. మేం ఎవర్నీ ఆపడం లేదని చురకలంటించారు. బీర్భూమ్ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపు లోకి తీసుకున్నట్టు డీజీపీ మనోజ్ మాలవీయ తెలిపారు.