Monday, January 20, 2025

ఎగ్జిట్ పోల్స్‌కు విలువ లేదు: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

ఎగ్జిట్ పోల్ జోస్యాలు వాస్తవ పరిస్థితికి తగినవి కావని, ఎందుకంటే అవి రెండు నెలల క్రితం ‘ఇంటిలో తయారు చేసినవ’ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం విమర్శించారు. అటువంటి ఎగ్జిట్ పోల్స్‌కు ఏమాత్రం విలువ లేదని వ్యాఖ్యానించిన మమత వాటిని ప్రదర్శించినందుకు మీడియాను విమర్శించారు. మమత ఒక టివి చానెల్‌తో మాట్లాడుతూ, ‘2016, 2019, 2021 సంవత్సరాల్లో ఎగ్జిట్ పోల్స్‌ను ఏవిధంగా నిర్వహించారో మేము చూశాం. వాటిలో ఏవీ చివరకు నిజం కాలేదు’ అని చెప్పారు. ‘ఈ ఎగ్జిట్ పోల్స్‌ను మీడియా వినియోగం కోసం కొందరు వ్యక్తులు రెండు నెలల క్రితం ఇంటిలో తయారు చేశారు. వీటికి విలువ ఏమీ లేదు’ అని ఆమె అన్నారు.

తన ర్యాలీల్లో జనం స్పందన ఎగ్జిట్ పోల్స్ జోస్యాలను నిర్ధారించలేదు అని మమత తెలిపారు. ‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల కోటాలను ముస్లింలు లాక్కుంటున్నారంటూ తప్పుడు సమాచారాన్ని బిజెపి వ్యాప్తి చేసిన తీరుతో ముస్లింలు బిజెపికి వోటు వేస్తారని నేను అనుకోను. పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి సిపిఐ (ఎం), కాంగ్రెస్ సాయం చేశాయని భావిస్తున్నా’ అని ఆమె చెప్పారు. బెంగాల్‌లో టిఎంసి కన్నా బిజెపికి ఎక్కువ సీట్లు వస్తాయని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఇండియా కూటమి అవకాశాల గురించి మమత ప్రస్తావిస్తూ, ‘అఖిలేశ్ (యాదవ్), తేజస్వి (యాదవ్), స్టాలిన్ (ఎంకె), ఉద్ధవ్ (థాక్కరే) సత్ఫలితాలు సాధిస్తారు. ప్రతి చోట ప్రాంతీయ పార్టీల ప్రదర్శన బాగుంటుంది’ అని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News