రొటేషన్ పద్ధతిలో దేశానికి 4 రాజధానులు ఉండాలి
వేర్వేరు చోట్ల పార్లమెంట్ సమావేశాలు జరగాలి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్
కోల్‌కత: రొటేషన్ పద్ధతిలో దేశంలో నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండు చేశారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉండే ఈ నాలుగు రాజధానులలో పార్లమెంట్ సమావేశాలు రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలని ఆమె సూచించారు. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా జనవరి 23న పరాక్రమ దివస్‌గా పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తనను సంప్రదించలేదని ఆమె తెలిపారు.
నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు ఒక మహా ర్యాలీని నిర్వహించిన ఆమె ప్రసంగిస్తూ బ్రిటిషర్ల పాలనలో దేశ రాజధానిగా కోల్‌కత ఉండేదని గుర్తు చేశారు. రొటేషన్ పద్ధతిలో నాలుగు రాజధానులు ఉండాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. దేశానికి ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పార్లమెంట్ సమావేశాలు జరగాలని ఆమె చెప్పారు. దేశానికి ఒకే రాజధాని అనే భావన మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. బోస్ జయంతిని దేశ్‌నాయక్ దివస్‌గా ఎందుకు పాటిచడం లేదని ఆమె ప్రశ్నించారు. పరాక్రమ్ అంటే ఏమిటనికూడా ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా తనను ఇష్టపడకపోవచ్చునేమో కాని నిర్ణయం తీసుకునే ముందు తనను సంప్రదించి ఉండాల్సిందని ఆమె చెప్పారు. నేతాజీ మునిమనమలు సుగతా బోస్ లేదా సుమంత్ర బోస్‌నైనా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
పరాక్రమ్ దివస్ అనే పేరు ఎవరు ఇచ్చారని మమత ప్రశ్నించారు. దేశ్‌నాయక్ దివస్‌కు ఒక చరిత్ర ఉంది కాబట్టే తాము ఆ పేరుతో ఇక్కడ(బెంగాల్‌లో) జయంతి ఉత్సవాలు జరుపుతున్నామని ఆమె తెలిపారు. నేతాజీని దేశ్‌నాయక్‌గా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారని, బెంగాల్‌కు చెందిన ఇద్దరు మహానుభావులను సంయుక్తంగా స్మరించుకోవడానికే తాము ఆ పేరిట ఉత్సవాలు జరుపుకుంటున్నామని మమత తెలిపారు.
Mamata Banerjee demands for 4 rotating national capitals