Friday, November 22, 2024

సొంత తమ్ముడికి మమత కటీఫ్

- Advertisement -
- Advertisement -

వారసత్వ రాజకీయాలకు దూరం
హౌరా సీటుపై బాబున్ బెనర్జీ కన్ను

కోల్‌కత: సొంత తమ్ముడు బాబున్ బెనర్జీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో హౌరా స్థానాన్ని సిట్టింగ్ ఎంపి ప్రసూన్ బెనర్జీ కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాబున్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మమతను తీవ్ర ఆగ్రహానికి లోనుచేశాయి. తాను, తన కుటుంబం బాబున్‌తో అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు మమత ప్రకటించారు. ప్రతి ఎన్నికకు ముందు బాబున్ ఒక సమస్యను సృష్టిస్తాడని, అత్యాశపరులను తాను ఇష్టపడనని ఆమె తెలిపారు. బాబున్‌కు ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, వారసత్వ రాజకీయాలను తాను విశ్వసించబోనని ఆమె స్పష్టం చేశారు.

అతనితో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇకపైన అతనికి తనకు ఎటువంటి సంబంధాలు లేవని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె స్పష్టం చేశారు. ప్రసూన్ బెనర్జీని హౌరా సీటుకు ఎంపిక చేసినట్లు మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటలకే అభ్యర్థి ఎంపిక పట్ల తాను సంతృప్తిగా లేనని బాబున్ బెనర్జీ ప్రకటించారు. ప్రసూన్ జోషి సరైన ఎంపిక కాదని, సమర్థులైన అభ్యర్థులను పార్టీ విస్మరిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రసూన్ తనకు చేసిన అవమానాన్ని తాను మరచిపోనని ఆయన చెప్పారు.

తాను కూడా హౌరా నుంచి పోటీ చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఓటర్లు కోరుకుంటే తాను స్వతంత్ర అభ్యర్థిగా సైతం పోటీ చేస్తానని ఆయన తెలిపారు. తన సోదరి(మమత) తనతో ఏకీభవించక పోవచ్చునని, అయినప్పటికీ అవసరమైతే హౌరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. 2009 ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి అంబికా బెనర్జీని ఓడించిన ప్రసూన్ బెనర్జీ వరుసగా మూడుసార్లు హౌరా నుంచి గెలుపొందారు. నాలుగవసారి ఆయనను అదే స్థానం నుంచి మమత బరిలోకి దింపుతున్నారు. ఇదిలా ఉండగా మమత కుటుంబంలో విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబున్ బెనర్జీని తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. యితే ఈ వార్తలను బాబున్ తోసిపుచ్చారు. మమతా బెనర్జీ ఉన్నంత వరకు తాను పార్టీని వదలడం కాని మరో పార్టీలో చేరడం కాని జరిగే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు క్రీడలతో సంబంధాలు ఉన్నాయని, ఆ విధంగా బిజెపి నాయకులు చాలా మంది తనకు తెలుసునని ఆయన చెప్పారు. అయితే బాబున్ వివరణకు మమత సంతృప్తి చెందలేదు.

బాబున్ ఏం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, పార్టీ మాత్రం అధికారిక అభ్యర్థికే కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కాగా..గత వారం పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలలో టిఎంసి అభ్యర్థులే పోటీ చేస్తారని మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. పార్లమెంట్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మహువా మొయిత్రాను కృష్ణానగర్ నుంచి, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని డైమండ్ హార్బర్ నుంచి ఆమె బరిలోకి దింపుతున్నట్లు ఆమె ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, టిఎంసి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తామని మమత ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం కనీసం ఐదు స్థానాలు ఇవ్వాలని పట్టుపడుతోంది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ రెండు స్థానాలలో మాత్రమే గెలుపొందడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News