మోడీ, షాపై మమత మండిపాటు
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను దుర్యోధన, దుశ్శాసనులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. అంతేగాక తనపై తిరుగుబాటు చేసి నందిగ్రామ్‌లో తనకు ప్రత్యర్థిగా బిజెపి తరఫున బరిలో నిలిచిన సువేందు అధికారిని మీర్ జాఫర్‌గా అమె అభివర్ణించారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభకు వీల్ చెయిర్‌లో హాజరైన మమతా బెనర్జీ బిజెపికి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బెంగాలీ ప్రజలకు బిజెపి అవసరం లేదని, ప్రధాని మోడీ మొహం తాము చూడబోమని ఆమె చెప్పారు.
బెంగాల్ ప్రజలకు అల్లర్లు, లూటీలు చేసేవారు, దుర్యోధన, దుశ్శాసన, మీర్ జాఫర్‌లు అవసరం లేదని ఆమె చెప్పారు. మార్చి 27న ఆట ముగుస్తుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను గుడ్డిగా నమ్మినందుకు సువేందు అధికారి తనకు నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. గురువారం పురూలియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆట ముగిసింది అని తన డైలాగునే కాపీ కొట్టారని ఆమె ఎద్దేవా చేశారు. ఎలా ఉన్నారంటూ బెంగాల్ ప్రజలను తన అనువాదకుడి ద్వారా మోడీ అడిగారని, బెంగాల్ చాలా బాగుందని, బెంగాలీలకు బిజెపి అవసరం లేదన్నదే తన నినాదమని ఆమె చెప్పారు. తన శరీరంలో ప్రతి అవయవం గాయపడిందని, ఎన్నికలు సమీపిస్తున్నందు వల్ల తన కాళ్లను విరగొట్టాలని వాళ్లు(బిజెపి) కోరుకున్నారని మమత ఆరోపించారు.