Friday, December 20, 2024

విపక్ష కూటమి పేరు ‘భారత్’గా మార్చుకుంటే.. అప్పుడు దేశం పేరును బిజెపిగా మారుస్తారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ అంశంపై ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు సైతం స్పందించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. విపక్ష కూటమి‘ ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బిజెపి ఆందోళన చెందుతోందన్నా రు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా? అని ప్రశ్నించారు. ‘ ఇలా దేశం పేరు మార్పుపై అధికారిక సమాచారం ఏదీ లేదు. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ ఇండియా’ కూటమిగా ఏర్పడడం వల్లే ఇలా జరుగుతోంది. ఒక వేళ ఇండియా కూటమి తనపేరును భారత్‌గా మార్చుకుంటే అప్పుడు భారత్ పేరును బిజెపిగా మార్చేస్తారా? దేశం ఒక్క పార్టీదే కాదు,140 కోట్ల మంది ప్రజలది’ అని కేజ్రీవాల్ మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
దేశం పేరు మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది: మమత
కాగా దేశ చరిత్రను తిరగరాస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.మనం ఇండియాను భారత్‌అని పిలవాలనేంతగా ఒక్క సారి ఏం మార్పులు చోటు చేసుకున్నాయని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ ఈ రోజు కేంద్ర పాలకులు ఆండియా పేరును మార్చేశారు.జి20 సదస్సు ఆహ్వాన పత్రంలో భారత్ అని రాశారని ఆంగ్లంలో మనం ఇండియా అంటామని, ఇండియా రాజ్యాంగమని పేర్కొంటామని మమత గుర్తు చేశారు. హిందీలో భారత్‌కా సంవిధాన్ అంటామని, మనమందరం భారత్ అంటామని, అందులో కొత్త ఏముందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరు సుపరిచితమని, అసలు ఇప్పటికిప్పుడు దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మమత ప్రశ్నించారు. కోల్‌కతాలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియా అంటేనే ఉలిక్కి పడుతున్నారు : స్టాలిన్
కాగా విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే బిజెపి ఇండియా పేరును భారత్‌గా మార్చాలని అనుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దుయ్యబట్టారు. ఇండియా అనే ఒక్క పదంతోనే బిజెపి ఉలిక్కి పడుతోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. బిజెపియేతర శక్తులన్నా ఫాసిస్టు బిజెపి సర్కార్‌ను మట్టిగరిపించడానికి ఇండియా పేరుతో ఏకం కాగానే కాషాయపార్టీ ఇండియా పేరును భారత్‌గా మార్చాలని అనుకుంటోందని స్టాలిన్ ఆరోపించారు. బిజెపి రూపు రేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన బిజెపి తొమ్మిదేళ్ల తర్వాత దేశం పేరును మార్చేస్తోందని దుయ్యబట్టారు.

రాజ్యాంగంలోనే ఇండియా ఉంది: సిద్దరామయ్య
కాగా ఇండియా పేరును దేశం మొత్తం ఆమోదించిందని, ప్రత్యేకంగా భారత్ అని మార్చాల్సిన అవసరం లేదని కర్నాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగంలోనే ఇండియా అంటే భారత్ అని ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News