Monday, December 23, 2024

నేడు విపక్షాల కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికపై ఉమ్మడి అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన చర్చ
హాజరుకానున్న కాంగ్రెస్ సహా పలు పక్షాలు
ఎన్‌సిపి అధినేత పవార్‌తో మమత ప్రత్యేక భేటీ
నేను రాష్ట్రపతి రేసులో ఉండబోను : శరద్ పవార్

న్యూఢిల్లీ: రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అనుసరించబోయే వ్యూహాన్ని చర్చించడం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున ఎంపిలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ ప్రత్యేక భేటీలో అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ఈ భేటీకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటుగా ఎనిమిది మంది సిఎంలు, పలు పార్టీల నేతలకు మమత లేఖలు రాసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రేసులో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, జెడి(ఎస్ చీఫ్), మాజీ ప్రధాని దేవెగౌడ లాంటి సీనియర్ నేతల పేర్లను తెరపైకి తీసుకురావచ్చని తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని శరద్ పవార్ నిర్ణయించుకున్నట్లు ఎన్‌సిపి వర్గాలు చెబుతున్న నేపథ్యంలో మంగళవారం మమతా బెనర్జీ పవార్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం నాటి సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ పవార్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. పవార్‌ను పోటీకి ఒప్పించడం కోసమే మమత ఆయనతో సమావేశమయినట్లు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News