Monday, January 20, 2025

నేను రాష్ట్రపతి రేసులో లేను: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ స్పష్టీకరణ
పవార్‌తో ప.బెంగాల్ సిఎం మమత భేటీ
నేడు టిఎంసి నేతృత్వంలో విపక్షాల కీలక సమావేశం

Mamata Banerjee meets Sharad Pawar

న్యూఢిల్లీ/ముంబై : రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని శరద్ పవార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను’ అని సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఎన్‌సిపి సమావేశంలో శరద్ పవార్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయనే దానిపై శరద్ పవార్‌కు నమ్మకం లేదని, అందుకే పోటీ చేసేందుకు ఆయనకు ఇష్టం లేదని ఎన్‌సిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే పవార్ తన అభిప్రాయాన్ని ఇంకా కాంగ్రెస్‌కు చెప్పలేదని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుపున 81 ఏళ్ల పవార్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. పవార్ అభ్యర్థిత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం ముంబైలో శరద్‌పవార్‌తో భేటీ అయి, వెల్లడించినట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఫోన్‌లో చర్చించారు. మంగళవారంనాడు వామపక్ష నేతలు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. అనంతరం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు పవార్ సుముఖంగా లేరని, ఆయనే స్వయంగా విషయం చెప్పారని అన్నారు. విపక్షాల అభ్యర్థిగా మరో పేరును పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన తెపారు.

పవార్‌ను ఒప్పంచే పనిలో మమత…

రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15న(బుధవారం) ఢిల్లీలో ప్రతిపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మంగళవారంనాడు ఢిల్లీ చేరుకున్న ఆమె పవార్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇద్దరం చర్చించుకున్నట్లు తర్వాత శరద్ పవార్ ట్విటర్‌లో వెల్లడించారు. ఇరువురు సమావేశమైన ఫొటోను కూడా అందులో షేర్ చేశారు.

రాష్ట్రపతి పదవికి పోటీలో నిలిచేలా ఆయనను ఒప్పించేందుకే మమత, పవార్‌తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. టిఎంసి కూడా తన ట్విటర్ ఖాతాలో దీనిని ధృవీకరించింది. మరోవైపు బుధవారంనాడు మమత ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి 22 పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ తరపున రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు జైరాం రమేష్, రణ్‌దీప్ సూర్జేవాలా హాజరుకానున్నట్లు సమాచారం. ఎన్‌సిపి నుంచి శరద్ పవార్, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, డిఎంకె నుంచి టిఆర్ బాలు, సిపిఎం తరపున ఎలమరం కరీం, సిపిఐ నుంచి బినోయ్ విశ్వం, శివసేనకు చెందిన ముఖ్య నేతలు హాజరవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థిపైనే చర్చ జరగనుందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News