వక్ఫ్ చట్టంపై ముర్షిదాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజ్వరిల్లిన హింసాకాండకు ‘బయటి వ్యక్తులు’ బాధ్యులు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. పరిస్థితిని మదింపు వేయడానికి తాను మే మొదటి వారంలో కల్లోలిత ప్రాంతాలను సందర్శించగలనని ఆమె తెలియజేశారు. మిడ్నపూర్‌లో ఒక అధికారిక కార్యక్రమంలో మమత మాట్లాడుతూ, ముర్షిదాబాద్ జిల్లాలోని ధులియాన్‌లో రెండు వార్డుల్లో జరిగిన అల్లర్ల వెనుక ‘కుట్రదారులను’ తన ప్రభుత్వం ‘త్వరలో బహిర్గతం చేస్తుంది’ అని తెలిపారు. ‘హింసాకాండ దురదృష్టకరం. మేము అల్లర్లను కోరుకోవడం లేదు. బయటి వ్యక్తులు కొందరు దానికి కుట్ర పన్నారు. వారిని, వారి కుట్రను వెలుగులోకి తెస్తాం’ అని మమత చెప్పారు. ‘ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు వంతున పరిహారం చెల్లిస్తామని హింసాకాండ మృతుల కుటుంబాలకు వాగ్దానం చేశాను.
‘బంగ్లార్ బారి’ పథకం కింద వారి ఇళ్లను కూడా పునర్నిర్మిస్తాం& నేను మే మొదటి వారంలో అక్కడికి వెళ్లి, పరిస్థితిని మదింపు వేయబోతున్నాను’ అని మమత తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) చట్టం వ్యతిరేక నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనల్లో మరణించిన ఒక వ్యక్తిని, అతని కుమారుని కుటుంబ సభ్యులను రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఈ నెల 19న కలుసుకుని, సాధ్యమైనంత వరకు సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలారంభంలో హింసాత్మక సంఘటనల్లో తండ్రి, కుమారుడు సహా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా 280 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.