Tuesday, December 17, 2024

జూనియర్ డాక్టర్ హంతకుడికి ఉరిశిక్ష తప్పనిసరి : మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర కోల్‌కతా లోని ఆర్‌జీ కాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ నిర్వహణ లోని హాస్పిటల్ సెమినార్‌హాల్‌లో మృతదేహం శుక్రవారం కనిపించింది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో వెల్లడైంది. దీనిపై రాష్ట్రముఖ్యమంత్రి మమతాబెనర్జీ శనివారం తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితునికి తప్పనిసరిగా ఉరిశిక్షపడాలని ప్రభుత్వం కోరుకుంటోందని, కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించాలని అధికారులకు సూచిస్తున్నట్టు చెప్పారు. ఈ సంఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు నిందితునికి కఠినాతికఠినమైన శిక్ష పడాలని, ఆస్పత్రుల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతూ బెంగాల్ ఛానెల్‌లో మాట్లాడారు. ఈ కేసుపై సిబిఐ, లేదా మరేదైనా సంస్థ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. ఇది భయంకరమైన, అసహ్యకరమైన సంఘటన అని వ్యాఖ్యానించారు.

వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు తమ ఆరోగ్య సేవలను కొనసాగించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. డాక్టర్లపై దౌర్జన్యాలు, నేరాలు జరగకుండా ప్రతి ఆస్పత్రిలో పోలీస్ క్యాంప్‌లు ఏర్పాటైనట్టు చెప్పారు. అలాగే ఆస్పత్రులు, మెడికల్ కాలేజీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్ తమ ఆస్పత్రుల్లో అంతర్గత భద్రత నిర్వహణలో బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. వారి విషయంలో ఎలాంటి నిర్లక్షం జరిగినా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ సంఘటనపై సిబిఐ దర్యాప్త చేపట్టాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ డాక్టర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్ హాలులో అర్థనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. శుక్రవారం తెల్లవారుజామున 36 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండవచ్చని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తికి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్టు పోలీస్‌లు గుర్తించారు. నేరంలో ఆ వ్యక్తి పాల్గొన్నట్టు అనుమానాలు ఉన్నాయని పోలీస్‌లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News