అఖిలపక్ష సమావేశానికి డిమాండ్
కోల్‌కతా : ఇంధనం ధరలు అడ్డూ ఆపూ లేకుండా అమాంతంగా పెరిగిపోతుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తు త ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి పరిష్కారాలు కనుగొనేందుకు అఖిల పక్షసమావేశాన్ని నిర్వహించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో సాగుతున్న అరాచకాల నుంచి దృష్టి మళ్లింప చేయడానికి పెట్రోలు, డీజిల్ ధరలను అమాంతంగా పెంచుకోడానికి వీలు కల్పిస్తోందని మమత ధ్వజమెత్తారు. ఇంధనం ధరలను అదుపు చేయడానికి కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని, ఈ సంక్షోభానికి బిజెపి ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో గెలిచినందుకు ప్రజలకు బిజెపి ఇచ్చిన బహుమతి ఇదేనని వ్యాఖ్యానించారు. విపక్షాలపై సిబిఐ, ఇడి వంటి సంస్థల దాడులను ప్రేరేపించేబదులు ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.