బెంగాల్‌లో ఆడియో టేప్ ప్రకంపనలు
కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన రోజున బిజెపికి చెందిన ఒక స్థానిక నాయకుడితో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంభాషణలకు చెందిన ఆడియో క్లిప్పింగ్‌ను బిజెపి విడుదల చేయడం శనివారం బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టించింది. నందిగ్రామ్‌కు చెందిన ఒక బిజెపి నాయకుడిని తిరిగి టిఎంసిలో చేరి తన గెలుపునకు తోడ్పడవలసిందిగా మమత కోరుతున్నట్లు ఆ ఆడియో క్లిప్పింగ్ ద్వారా తెలుస్తోంది. దీనిపై బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలుసుకుని ఆడియో టేపును అందచేసింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ తన గెలుపు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
కాగా..ఈ ఆడియో టేపును నకిలీదిగా అధికార టిఎంసి తోసిపుచ్చింది. అయినప్పటికీ టిఎంసి నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరిన సువేందు అధికారి వెంట వెళ్లిన ప్రలయ్ పాల్‌ను పార్టీలోకి తిరిగి రావాలంటూ మమత పిలవడంలో తప్పేముందని టిఎంసి నాయకులు ప్రశ్నించారు. తన మాజీ కుడి భుజమైన సువేందు అధికారి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న నందిగ్రామ్‌లో మమత ఆయనపై పోటీచేస్తున్నారు. తన గెలుపునకు సహకరించాలని ప్రలయ్ పాల్‌ను మమత కోరినట్లు ఆ టేపులో ఉంది. అయితే తనకు ఫోన్ చేసినందుకు తాను కృతజ్ఞుడినని, కష్టకాలంలో తనకు అండగా నిలబడిన సువేందు అధికారి సోదరులకు తాను నమ్మక ద్రోహం చేయలేనని పాల్ సమాధానమివ్వడం టేపులో వినిపించింది.