బిజెపి ఒత్తళ్లకు లొంగకుండా పదవికి రాజీనామా చేసినందుకు గోయల్‌కు హ్యాట్సాప్ చెప్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర బలగాల మోహరింపునకు సంబంధించి ఢిల్లీ( బిజెపి) పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగనందుకు అరుణ్ గోయల్‌ను అభినందిస్తున్నా. ఎన్నికల పేరుతో వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో దీంతో రుజువైంది’ అని అన్నారు. మోడీ, ఆయన ఎంపిక చేసిన మంత్రి లోక్‌సభ ఎన్నికలకు ముందు
తమకిష్టమైన వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవడం కోసమే గోయల్‌ను అర్ధంతరంగా రాజీనామా చేసేలా ఎత్తిడి తీసుకువచ్చారని టిఎంసి నాయకుడు సాకేత్ గోహలే అన్నారు. కాగా ఎన్నికల కమిషన్‌ను తమ ఆదేశాలకు తలూపే వాళ్లతో నింపడం కోసమే అరుణ్ గోయల్ రాజీనామాను వెంటనే ఆమోదించారని రాజ్యసభ స్వతంత్ర ఎంపి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు గోయల్ చెప్పిన కారణం న్యాయమైందే కావచ్చునేమో కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేయడం ఆందోళన కలిగించే అంశమని సిబల్ అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ శాఖగా మారిపోయిందని సిబల్ కూడా ఆరోపించారు.