బిజేపిపై మమతా ఫైర్
కోల్‌కతా : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని హావ్‌డాలో శనివారం కూడా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రముఖ్యమంత్రి , టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ మరోసారి బిజెపిపై మండిపడ్డారు. ఈ అల్లర్ల వెనుక కొన్ని పార్టీల హస్తముందని ఆరోపించారు. నేను ముందే చెప్పినట్టు రెండు రోజులుగా హావ్‌డాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వాటి వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి. అయితే వాటిని సహించేది లేదు. వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిజెపి చేసిన పాపానికి ప్రజలు ఇబ్బందులు పడాలా ? అంటూ ట్వీట్ చేశారు.
పోలీసులపై రాళ్లు రువ్విన అల్లరిమూకలు
హావ్‌డా లోని పాంచ్లా బజార్‌లో శనివారం ఉదయం ఆందోళనకారులు నిరసన చేపట్టారు. వీరిని అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసుల పైకి అల్లరిమూకలు రాళ్లు విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి నిరసన కారులను చెదరగొట్టారు. ఈ ప్రాంతంలో జూన్ 15 వరకు ముగ్గురు కంటే ఎక్కువ గుమికూడడంపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.