సలహాదారుగా అమిత్ మిత్రా కొనసాగింపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం క్యాబినెట్‌ను పునర్వవస్థీకరించారు. మేజర్ పోర్ట్‌ఫోలియోలను మార్చారు. “సుబ్రత ముఖర్జీ కన్నుమూశాక పంచాయత్, గ్రామీణాభివృద్ధి మంత్రి పదవిని పులక్ రాయ్‌కు కేటాయించడం జరిగింది” అని ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి పార్థ చటర్జీ క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో అన్నారు. ప్రస్తుతం రాయ్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జీగా ఉన్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆరేళ్ల పదవీ కాలం సమాప్తం అయింది. పైగా ఆయన ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. దాంతో ఆయన శాఖ ఆటోమేటిక్‌గా ముఖ్యమంత్రి నియంత్రణలోకి వెళ్లిపోయింది. కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం చంద్రిమ భట్టాచార్యను ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమించారు. అంతేకాక మిత్రను ప్రభుత్వంలో ఉండమనికోరారు. ముఖ్యమంత్రి మిత్రను ఆర్థిక శాఖ సలహాదారుగా, పూర్తి స్థాయి మంత్రి హోదాలో ఉంచారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి సాధన్ పాండే ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన శాఖను జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి మానస్ భుయియాన్‌కు అదనపు బాధ్యతగా అప్పగించారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రి శశి పంజాకు స్వయం సహాయక గ్రూప్ శాఖ అదనపు బాధ్యతను ఇచ్చారు. కాగా బేచరమ్ మన్నాకు అదనంగా పంచాయత్ శాఖ బాధ్యతను ఇచ్చారు. ఇదిలావుండగా ‘ఈ మార్పు కొంత కాలంకే పరిమితం. ఈ మార్పులను మరో నెల తర్వాత పునసమీక్షించడం జరుగుతుంది. మళ్లీ శాఖల పునర్వవస్థీకరణ జరుగుతుంది” అని మమతా బెనర్జీ వివరించారు.