కోల్‌కతా : తాను దుర్బిణి వేసి చూసినా కాంగ్రెస్‌కు మూడో సీటు ఇవ్వడానికి ఏదీ కన్పించడం లేదని టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ స్పందించారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బెంగాల్ నుంచి కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇస్తామని , అంతకు మించి ఇవ్వడానికి కుదరదని కాంగ్రెస్ నేతలకు మమత తేల్చిచెప్పారు. అయితే తమకు కనీసం ఐదు లేదా మూడు సీట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ కోరడంపై మమత బెనర్జీ శుక్రవారం నిర్మొహమాటంగానే జవాబు చెప్పారని వెల్లడైంది. తాము ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీకి బలీయమైన గెలిచే మూడోస్థానం ఉందా? తనకు అయితే ఎంత వెతికినా ఇది కన్పించడం లేదని మమత వ్యాఖ్యానించారు. తాను బైనాక్యులర్ పెట్టి చూసినా ఎక్కడా ఇది కన్పించడం లేదన్నారు.
ఇప్పటికీ ఈ విషయంలో ఆమె ఆలోచిస్తున్నారని, పలు విధాలుగా ఏకాభిప్రాయం కుదిరితే ఈ దిశలో ఆమె స్పందించేందుకు వీలుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు బెంగాల్‌లో బిజెపి ఆధీనంలో ఉన్న మూడు స్థానాలు డార్జిలింగ్, మాల్దా, రాణిగంజ్ నుంచి పోటీ చేస్తామని కాంగ్రెస్ చెపుతోంది. ఇక పురులియా కూడా బిజెపి స్థానంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి, ఇతర చోట్ల ఆప్‌తో సీట్ల సర్దుబాట్ల తంతుతో కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా ఇతర పార్టీలతో సర్దుబాట్లు కుదుర్చుకుని , ఇండియా కూటమిని ఎన్‌డిఎకు సరైన ధీటుగా నిలిపితీరాలని పట్టుదలతో ఉంది. ఈ దిశలో రాహుల్, ప్రియాంక గాంధీలు ఎక్కువగా చొరవ తీసుకుంటున్నారు.