కోల్‌కత: అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పాఠశాలల్లో టీచర్ల నియామక కుంభకోణానికి సంబంధించి టిఎంసి నేత, రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోర్టులో నేరం రుజువైతే ఎవరికైనా శిక్షపడుతుందని, కాని రాజకీయ పార్టీలను అప్రదిష్టపాల్జేయడానికి దర్యాప్తు సంస్థలను వాడుకోవడం తగదని బుధవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మమత వ్యాఖ్యానించారు. పాఠశాలల నియామక కుంభకోణంలో మీడియా విచారణలను ఆమె ఖండించారు. ఒక పెద్ద వ్యవస్థను నడుతుపుతున్నపుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని, ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆమె అన్నారు. అయితే..మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తాను ఖండిస్తునాననిఆమె చెప్పారు. న్యాయస్థానం పాత్రను మీడియా పోషిస్తోందని, ఇదే విషయాన్ని ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా అన్నారని ఆమె గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రోద్బలంతో ప్రతిపక్ష నాయకులతోపాటు వ్యాపారవేత్తలను కూడా దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. రాజ్యసభలో మంగళవారం 19 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ..ఈరోజుల్లో ఏ విషయంపైనైనా నిరసన తెలియచేస్తే సస్పెండ్ అవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
Mamata Banerjee Slams Media Malicious Campaign