వచ్చే ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భోణిపోర్ తో పాటు నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనెర్జీ ఒకేసారి రాజకీయ కలకలం సృష్టించారు. దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బెంగాల్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపగలడో చూడవలసి ఉంది.
మరో మూడు, నాలుగు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కైవసం చేసుకోవడానికి బిజెపి సిద్ధంగా ఉన్నట్లు కనపడటం, అనేకమంది టిఎంసి ప్రజాప్రతినిధులు వరుసగా ఆ పార్టీలో చేరుతూ ఉండడంతో మమతా అధికారానికి రోజులు దగ్గరపడ్డాయనే అభిప్రాయం కలుగుతూ వచ్చింది.
34 ఏళ్ళ తిరుగులేని సిపిఎం ప్రభుత్వాన్ని మట్టికరిపించి, ఒంటరిగా పోరాటం చేసి పదేళ్లక్రితం ఆమె అధికారంలోకి రావడానికి నందిగ్రామ్-సింగూర్ లలో ఆమె వీరోచితంగా జరిపిన రైతాంగ పోరాటాలే కారణం. ఇప్పుడు కూడా తన అధికారాన్ని బిజెపి సవాల్ చేస్తున్న సమయంలో మరోసారి నందిగ్రామ్ ఆమెను ఏ మాత్రం ఆదుకొంటుందో చూడవలసి ఉంది.
వాస్తవానికి దేశం మొత్తం మీద భూసంస్కరణలు విజయవంతంగా బెంగాల్ లో సిపిఎం ప్రభుత్వం అమలు జరిపింది. ప్రభుత్వం ఇచ్చిన భూములనే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం, దేశంలో అప్పట్లో మరెవ్వరు ఇవ్వనంత భారీ పరిహారం ఇవ్వజూపుతూ సేకరించే ప్రయత్నం చేస్తే రైతుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైనది.
వారి ప్రతిఘటనను ఆసరాగా తీసుకున్న మమతా, అక్కడనే 26 రోజుల పాటు నిరాహార దీక్ష కుడా జరిపి, ప్రభుత్వం తన ప్రతిపాదనలను వెనుకకు తీసుకొనేటట్లు చేయగలిగారు. ఎదురులేదనుకున్న సిపిఎం ప్రభుత్వాన్ని పడగొట్టి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేకుండా రాష్ట్రంలో నాలుగే పార్టీ స్థాయికి దిగజారేటట్లు ఆమె చేయగలిగారు.
ఆ ఉద్యమంలో తనకు అండగా ఉండడమే కాకుండా, రైతులను సమీకరించడంలో కీలక పాత్ర వహించి, సిపిఎంకు వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా నిర్ణయాత్మక పాత్ర వహించిన తన సహచర మంత్రి సువెందు అధికారిని బీజేపీ తనవైపుకు తిప్పుకోవడం ఒక విధంగా ఆమెకు కోలుకోలేని దెబ్బ తీసింది.
నందిగ్రామ్ నుండి సుంవెందు గత ఎన్నికల్లో 81,000 వేలకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు. అతని మీదనే పోటీ చేస్తానని మమతా ప్రకటించడంతో రాజకీయ కలకలం రేపింది. వెంటనే ఆమెను 50,000 ఓట్లతో ఓడిస్తానని సవాల్ చేసిన సువెందు, ఆ మరుసటి రోజు తన పార్టీ అక్కడి ఉంది ఎవ్వరిని నిలబెట్టినా ఆమెపై గెలిపిస్తాను అంటూ మాటమార్చారు. అంటే ఆయనలో ఆమెను ఎదుర్కొవాలంటే భయం ప్రారంభమైనదా?
రెండు, మూడు జిల్లాల్లో సుమారు 60 నియోజకవర్గాలపై ప్రభావం చూపగల సువెందు బిజెపికి చాల అండగా ఉండే అవకాశం ఉంది. అయితే వీధి పోరాటాల ద్వారా దేశంలో అత్యంత నిరంకుశ సిపిఎం ప్రభుత్వాన్ని ఒంటరిగా ఓడించిన మమతా ఎత్తుగడలను తట్టుకోగలరా?
వాస్తవానికి కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖేర్జీ నుండి దాదాపు నేతలందరూ సిపిఎంతో ఎదురుపడి పోరాటానికి వెనుకడుగు వేయడంతో ఆమె కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో సిపిఎం అణచివేత చర్యలను వీధులలోకి వచ్చి ఎదిరించిన వారిద్దరే. మొదటివారు మమతా కాగా, రెండు వారు ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజాన్ చౌదరి మాత్రమే కావడం గమనార్హం.
బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి, అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడంలో ఆరితేరిన జనం మధ్యకు వెళ్లి, పోరాటాలు జరుపగల నాయకత్వం ఆ పార్టీకి లేదన్నది స్పష్టం. వీధి పోరాటాలకు పేరొందిన బెంగాల్ రాజకీయాలలో బిజెపి ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో చూడవలసి ఉంది.
అన్ని నియోజకవర్గాలలో పోటీకి బలమైన అభ్యర్థులు లేనందునే ఇతర పార్టీల నుండి భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. ఎన్నికల నాటికి మమతా తప్పా ఆమె పార్టీలో మరెవ్వరు మిగలరని, అందరు బీజేపీలో చేరతారని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెప్పడం గమనార్హం.
అయితే మమతా రెండో సీట్ నుండి పోటీ చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని హైదరాబాద్ కు చెందిన ఎన్నికల విశ్లేషణ/సర్వే సంస్థ ప్యూపిల్స్ పల్స్ కు చెందిన ఉదయ్ బసు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బోవనిపోర్ లో 2011లో 95,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన ఆమె ఆధిక్యత 2016 నాటికి 25,000కు తగ్గిపోయినదని గుర్తు చేశారు.
ఆ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో వారు బిజెపి వైపు మొగ్గుచూపితే ఓటమి ఎదురు కావచ్చనే భయంతో ఆమె రెండు నియోజకవర్గం వైపు చుస్తున్నారని చెప్పారు. పైగా, నందిగ్రాం ఓటర్లలో 40 శాతం మంది ముస్లింలు కావడంతో వారి మద్దతు పట్ల మమతా ధీమాతో ఉన్నారు. కొలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ లోని బోవానీపూర్ వార్డ్ లో టిఎంసి అభ్యర్ధికన్నా బీజేపీ అభ్యర్హ్డికి 2019 లోక్ సభ ఎన్నికలలో 496 ఓట్లు అధికంగా వచ్చాయి.
బెంగాల్ లో 30 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లు మమతకు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. వారిలో బీహార్ లో వలే చీలిక తీసుకు వస్తే ఆమెను ఓడించడం తధ్యం అనే అభిప్రాయం బీజేపీ వర్గాలలో కలుగుతున్నది. అందుకనే వారి ప్రోత్సాహంతోనే మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసిని బెంగాల్ లో కూడా ప్రయోగిస్తున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. అందుకు ఆ రాష్ట్రంలో గట్టి ముస్లిం నేతగా పేరొందిన, మమతకు ప్రత్యర్థి అయిన అబ్బాస్ సిద్దిఖ్ కూడా జత అవుతున్నారు.
అయితే బీహార్ లో వలే ఇక్కడ ముస్లింలలో చీలిక తీసుకు రావడం అంత సులభం కాదని ఫూపుల్స్ పల్స్ కు చెందిన సజ్జన్ కుమార్ చెబుతున్నారు. ఎందుకంటె బీహార్ లో ఒవైసి ఐదారేళ్లుగా మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బెంగాల్ కు మొదటిసారి వెడుతున్నారు. అందుకనే అక్కడివలె అద్భుతమైన మార్పు బెంగాల్ లో సాధించడం సాధ్యం కాపోవచ్చని భావిస్తున్నారు. బెంగాల్ ఎన్నికలపై కీలక ప్రభావం చూపబోతున్న మరో ప్రధాన అంశం మాటువ దళిత్ లు. దేశ విభజన సమయంలో నేటి బాంగ్లాదేశ్ ప్రాంతం నుండి వలస వచ్చిన వీరి ప్రభావం 75 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉంది. వీరంతా మమతకు ఇంతకు ముందు గట్టి మద్దతు ఇచ్చేవారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు ఎదురైతే, సంబరాలు చేసుకున్నది బెంగాల్ లోని మాటువ దళితులు మాత్రమే కావడం గమనార్హం.
కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాము దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పౌరసత్వం కల్పిస్తుందని ఆనందంతో వారంతా మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడంతో బిజెపి అనూహ్యంగా రాష్ట్రంలో 19 లోక్ సభ స్థానాలలో గెలుపొందింది. అయితే చట్టం తీసుకు వచ్చి చాలాకాలం అవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదు. అమలుకు అవసరమైన నిబంధనలను కేంద్రం రూపొందించలేదు. ఈ కేంద్రం ఒక ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
పొరుగునే ఉన్న అస్సాంలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో కూడా పౌరసత్వ చట్టం బిజెపికి కీలకం కానున్నది. సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో రూపొందించిన విదేశీయుల జాబితాలో బాంగ్లాదేశ్ నుండివచ్చిన వారంటూ అత్యధికంగా హిందువుల పేర్లు ఉన్నాయి. పౌరసత్వం చట్టం అమలు పరచడం ద్వారా అక్కడ హిందువులకు పౌరసత్వం తొలగిస్తే ఎన్నికలలో గెలుపొందడం ప్రశ్నార్ధకరం కాగలదు. బెంగాల్ లో మాటువ దళిత్ లకు పౌరసత్వం ఇవ్వని పక్షంలో అక్కడ వీరి మద్దతు కోల్పోవలసి వస్తుంది.
వారి మద్దతు కూడా మమతా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవంక కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెలాఖరుకు బెంగాల్ పర్యటన సందర్భంగా వారికి భరోసా కల్పించే ప్రకటన చేయవచ్చని తెలుస్తున్నది. ఒక వంక హిందుత్వ ధోరణులు ప్రదర్శించడం ద్వారా బిజెపి మద్దతు దారులలో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ, మరో వంక ముస్లిం మద్దతు దారులను కాపాడుకొంటూ మమతా వ్యూహాత్మకంగా వ్యవహరింప వలసి ఉంది. వనరుల సమీకరణలో ఏమాత్రం వెనుకబడని బీజేపీ ధీటుగా ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నది. అయితే మమతా వీధి పోరాటాల రాజకీయాలు బీజేపీ ఎత్తుగడలను ఏ మాత్రం అడ్డుకోగలవో చూడవలసి ఉంది.
Mamata Banerjee to contest for assembly elections from Nandigram