2024 లోక్‌సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం ఏర్పడవలసిన ఆవశకతను ముందుకుతెచ్చి కొత్త రాజకీయ వాతావరణాన్ని రూపొందిస్తున్నాయి. కీలక సందర్భాల్లో దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి, ప్రజలకు అండగా నిలవడంలో ప్రధాని మోడీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్దిమాసాల క్రితం జరిగిన ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో బిజెపి గణనీయ శక్తిగా నిరూపించుకోలేకపోయింది. ప్రతిపక్ష వేదిక మీద మమతా బెనర్జీ, స్టాలిన్‌లు బలమైన నేతలుగా అవతరించారు. అలాగే కేరళలో పినరయి విజయన్ తన ఎదురులేని నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోనైతే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలిద్దరు కలిసి సర్వశక్తులు ఒడ్డినా మమత బెనర్జీ వారిని ఘోర పరాజయానికి గురిచేసి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. దాంతో ఆమెకు జాతీయస్థాయి ప్రాధాన్యం పెరిగింది.
అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించగల ప్రత్యామ్నాయాన్ని రూపొదించి దానికి తగిన బలాన్ని చేకూర్చడమనేది ఎలా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎప్పటిమాదిరిగానే తన బలహీనతను చాటుకుంటున్నది. పటిష్ఠమైన నాయకత్వం లేక చుక్కానిలేని నావను తలపిస్తున్నది. ఆ ఒక్క పార్టీయే బిజెపిని మట్టి గరిపిస్తుందనే నమ్మకం కలగడం లేదు. అందుచేత ఇప్పటినుంచే బిజెపికి గట్టి ప్రత్యామ్నాయం నిర్మాణం జరగాలి. అది కాంగ్రెస్‌తో కూడుకున్నదా, కాంగ్రెసేతరమైనదా? అనే ప్రశ్న కూడా తలెత్తింది. జూన్‌లో ఢిల్లీలోని శరద్‌పవార్ అధికారిక నివాస గృహంలో జరిగిన ప్రతిపక్ష నేతల, మేధావుల సమావేశం బిజెపికి జాతీయస్థాయిలో బలమైన కొత్త ప్రత్యామ్నాయాన్ని రూపొందించే దిశగా జరిగిందేనని సాగిన ప్రచారం తెలిసిందే. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు గెలుపొందడానికి ఉపయోగపడిన సమర్ధుడైన వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఈ సమావేశానికి సూత్రధారిగా వ్యవహరించినట్టు భావించారు.
మమతబెనర్జీకి కూడా ఆయన సలహాలు, సూచనలు ఇచ్చివున్నారు. ఈయనతో పాటు అనేక ప్రతిపక్షాల నాయకులు పవార్ ఇంటి సమావేశానికి హాజరయ్యారు. జాతీయస్థాయిలో కొత్త శక్తి ఆవిర్భావంవైపు అడుగులు పడుతున్నాయనే అభిప్రాయానికి ఈ భేటీ అవకాశం కల్పించింది. అటువంటి శక్తి కాంగ్రెస్ తోడులేకుండా విజయం సాధించజాలదనే అభిప్రాయమూ గట్టిగా వినిపిస్తోంది. ఎంత చెడినా కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఉనికిగల రాజకీయ శక్తి అయినందున దానిని కలుపుకొని కొత్త శక్తిని నిర్మించడమే ప్రయోజనకరమనే భావన పుంజుకున్నది. వామపక్షాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. మమత బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఆటలు సాగనీయకుండా చేయగలిగిన అమేయ శక్తిగా అవతరించినప్పటికీ ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ సభ్యత్వాన్ని గెలుచుకోలేకపోయారు. నందిగ్రామ్‌లో ఓడిపోయారు. ఆరు మాసాల్లో శాసనసభ్యురాలు కాలేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించడం గమనించదగిన పరిణామం.
ఆమె చూపు జాతీయ నాయకత్వం మీద ఉందనే అభిప్రాయం కలుగుతున్నది. ఆమె మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జరుపుతున్న ఢిల్లీ పర్యటనలో అనేకమంది నాయకులను కలుస్తున్నారు. మొదటిరోజు లాంఛనప్రాయంగా ప్రధాని మోడీని కలుసుకున్న మమత ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులతోనూ సమావేశమయ్యారు. రెండోరోజు సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. ఆ భేటీలో రాహుల్‌గాంధీ సైతం పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ మళ్లీ చురుకైన పాత్ర వహిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం కలుగుతున్నది. అయితే కొత్త ఫ్రంట్‌లో కాంగ్రెస్ కలుస్తుందా, మూడో ఫ్రంట్ ఏర్పడితే అది కాంగ్రెస్‌ను కలుపుకుంటుందా, అటువంటి ఐక్య కూటమికి అగ్రభాగాన ఉండి నాయకత్వం వహించేవారు ఎవరు అనే ప్రశ్నలకు ఇంకా సరైన సమాధానాలు లేవు. అయినప్పటికీ మమత బెనర్జీ అడుగులు వేస్తున్న తీరు జాతీయస్థాయిలో కూడా బిజెపిని పరాజయం పాలుచేసి తీరాలనే కాంక్ష ఆమెలో గట్టిగా కూడుకట్టుకున్నట్టు సూచిస్తున్నది.
2024 లోక్‌సభ ఎన్నికలలోగా తృణమూల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత బెనర్జీ సన్నిహిత బంధువు అభిషేక్ బెనర్జీ ఇటీవలే ప్రకటించి ఉన్నారు. భారత జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తుల ఆవిర్భావం ఎలా జరుగుతుంది అనేది ఆసక్తికరమైన ప్రశ్న.