భవానీపూర్ ఉప ఎన్నికలో ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యంతో 58,835 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పశ్చిమబెంగాల్ సిఎం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు దశలో ప్రతి రౌండ్‌లోనూ మమత ఆధిక్యం చాటుకుని 58,835 ఓట్ల తేడాతో గెలిచారు. సౌత్ కోల్‌కతాలోని ఈ భవానీపూర్ స్థానంలో మమత బెనర్జీకి 85,263 ఓట్లు వచ్చాయి. సమీప బిజెపి ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌కు 26,428 ఓట్లు రాగా, సిపిఎం అభ్యర్థి స్రిజిబ్ బిశ్వాస్‌కు 4226 ఓట్లు దక్కాయని ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం వివరాలు వెలువరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే దిశలో భవానీపూర్ స్థానంలో విజయం మమతకు తప్పనిసరి అయింది.
ఈ దిశలో ఆమె గెలుపు భారీ స్థాయి ఆధిక్యతతో తన వ్యక్తిగత ఇమేజ్‌ను తిరుగులేకుండా చేసుకున్నారు. రాష్ట్రంలో జరిగిన మరో రెండు ఉప ఎన్నికలు ముర్షిదాబాద్‌లోని సంసేర్‌గంజ్, జాంగిపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టిఎంసి విజయం ఖాయం అని కౌంటింగ్ దశల్లో స్పష్టం అయింది. భవానీపూర్‌తో పాటు ఇక్కడ కూడా గురువారం పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో బెంగాల్ అసెంబ్లీకి హోరాహోరిగా జరిగిన ఎన్నికలలో మమత తమ టిఎంసిని తిరిగి గెలిపించారు, బిజెపిని అధికారపు ఆశలకు ఆమడ దూరంలో పెట్టారు. అయితే ఆమె ప్రతిష్టాత్మకంగా ఎంచుకుని పోటీకి దిగిన నందిగ్రామ్‌లో ఓడారు.
ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉండటంతో తన పాత సురక్షిత స్థానం భవానీపూర్‌ను ఎంచుకుని బరిలోకి దిగారు. బెంగాళీ ఓటర్లకు తాను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు , ప్రజలంతా ఈ విజయపు వార్త గురించి ఎదురుచూస్తున్నారని తనకు తెలుసునని, నందిగ్రామ్‌లో కుట్రలతో తనను ఓడించిన వారికి ఇక్కడి ప్రజలు ఈ విధంగా తగు జవాబు చెప్పారని మమత తమ ప్రకటనలో తెలిపారు. ఇక సంసేర్‌గంజ్‌లో టిఎంసి అభ్యర్థి అమిరుల్ ఇస్లామ్ , జాంగీపూర్‌లో ఈ పార్టీకే చెందిన జాకీర్ హుస్సేన్ భారీ స్థాయిలో విజయం దిశలో ఉన్నట్లు పలు రౌండ్ల లెక్కింపు సరళితో స్పష్టం అయింది.
ఒడిశా పిపిలీలో బిజెడి గెలుపు
ఒడిశాలోని పిపిలీలో జరిగిన ఉప ఎన్నికలలో అధికార బిజెడి అభ్యర్థి రుద్రా ప్రతాప్ మహరథీ 20 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆదివారం ఈ ఫలితం వెలువడింది. బిజెపి అభ్యర్థి అశ్రిత్ పట్నాయక్‌కు 76వేలకు పైగా ఓట్లు, మహారథీకి 96వేలకు పైగా ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి బిశ్వోకెషన్‌కు 4261 ఓట్లు వచ్చాయి.