పురాతన భవనాల పునాదులు గట్టిగా వుంటాయి. అవి మళ్లీ పుంజుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిసి కూడా వాటిని కూల్చివేయాలనుకుంటున్న వారు అవి లేని లోటును తీర్చగల సత్తా వున్నవారేనా అని ప్రజలు ఆలోచించకుండా వుండరు. కాంగ్రెస్ పార్టీ మీద వుండుండి శక్తివంతమైన బాంబులు ప్రయోగిస్తున్న మమతా బెనర్జీకి, ప్రశాంత్ కిశోర్‌కు, వారికి ఆశీస్సులందిస్తున్న శరద్ పవార్‌కు ఈ విషయం బొత్తిగా తెలీదనుకోలేము. పశ్చిమ బెంగాల్‌లో గతం కంటే మించిన మెజారిటీతో మూడో సారి అధికారం చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ దృష్టి దేశ పాలనాధికారం మీద పడింది. బెంగాల్ ఎన్నికల్లో తనకు వ్యూహ కర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ఆమె మెప్పును పొందారు. జాతీయ నాయకత్వంపై దృష్టితో తాను చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమానికి కూడా ఆయననే ముఖ్య సలహాదారుగా కొనసాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. జాతీయ నాయకత్వంపై మమతా బెనర్జీలో అంకురించిన ఆశలను అనతి కాలంలోనే పెంచి పెద్ద చేసి ఆమె కలను సాకారం చేయాలని ప్రశాంత్ కిశోర్ దీక్ష వహించారు.
గతంలో ఈయన సోనియా, రాహుల్ గాంధీలను కలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేయడం ద్వారా మమతా బెనర్జీని ఢిల్లీ పీఠం వైపు నడిపించాలని ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచన చేసినట్టు బోధపడుతున్నది. కాంగ్రెస్ రహిత ప్రతిపక్ష ఐక్య సంఘటనను ఆమె నాయకత్వంలో నిర్మించాలని సంకల్పించినట్టు వారి మాటల్లో స్పష్టపడుతున్నది. కాంగ్రెస్ కేవలం అధికారం కోసం పోటీ పడే ఒక పార్టీ మాత్రమే కాదు, దానికి గత చరిత్ర వుంది. తనదైన పద్ధతిలో దేశాన్ని నడిపించిన కీర్తిని కూడా మూటగట్టుకున్నది. ఆ మేరకు దేశంలో గణనీయమైన భాగంలో అది సజీవంగా వుంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా గురువారం నాడు అంగీకరించారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవరణ చాలా కీలకమైదని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి దైవమిచ్చిన హక్కు కాదని కూడా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ ముంబైలో శరద్ పవార్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.
ఆ సమయంలో మీడియా వేసిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ యుపిఎ (కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి) ఎక్కడుంది అని ఎదురు ప్రశ్న వేశారు. అది లేనేలేదని కూడా అన్నారు. ఇది సంచలనం సృష్టించింది. ఈ వ్యాఖ్య నేరుగా కాంగ్రెస్ పార్టీపై, దాని నాయకత్వంపై ఎక్కుపెట్టిందేనని స్పష్టపడుతున్నది. కాంగ్రెస్‌ను మూలమట్టంగా ధ్వంసం చేయడమొక్కటే ధ్యేయంగా మమత, ప్రశాంత్ కిశోర్ పావులు కదుపుతున్నారు. వారి లక్షం బిజెపిని దేశాధికార పీఠం నుంచి తొలగించడమే అయితే కాంగ్రెస్‌ను పదేపదే ఇలా ఎండగట్టవలసిన పని లేదు. ఇప్పుడు మమతా బెనర్జీకి గాని, ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్‌లకు గాని ప్రథమ శత్రువు కాంగ్రెస్సేనని బయటపడుతున్నది. కాంగ్రెస్‌కున్న మూలాల నుంచి దానిని పెకలించి దాని ఆవరణను తమ పాదాక్రాంతం చేసుకోవాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. అది సులభంగా సాధ్యమయ్యే పనేనా? అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఐక్యప్రతిపక్షాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చేపట్టి అందుకోసం తక్షణమే పలు చర్యలు తీసుకోవాలని తాము సూచించామని అయినా కాంగ్రెస్‌లో కదలిక రాలేదని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్‌కు గత కీర్తి తలకెక్కి వుంది. వీలైనంత మేరకు దేశాధిపత్యాన్ని పూర్వం లాగా ఒంటిచేత్తో వెలగబెట్టాలని అది ఇప్పటికీ కోరుకుంటూ వుండొచ్చు. పలు రాష్ట్రాల్లో తనకు ఇప్పటికీ చెప్పుకోదగిన ఉనికి, బలం వున్నాయన్న ధీమా దానిది. ఒక్క పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గోవా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వేళ్లూనుకోవాలని చూస్తున్నది. ప్రాంతీయ పక్షాలన్నీ ఏమేరకు మమతా బెనర్జీ నాయకత్వం కింద సంఘటితమవుతాయనేది కూడా ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నే. అలాగే ప్రాంతీయ పక్షాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తన వెంట కూడగట్టుకోగల అవకాశాలూ తక్కువే. ప్రతిపక్ష శిబిరం ఇంతగా చీలిపోయి అస్పష్టంగా వున్న దశలో ఎవరైనా చేయవలసింది కాంగ్రెస్‌ను, ఇతర బిజెపి వ్యతిరేక పక్షాలనూ ఒక్క చోటకు చేర్చి కేంద్రంలోని పాలక పార్టీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి ప్రయత్నించడం.
అటువంటి అవకాశాలు లేవని, కాంగ్రెస్ రహిత ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలనే ఆరాటంతోనే మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారని, ఆ వైపుగా ఆమెను శరద్ పవార్ ముందుకు తోస్తున్నారని బోధపడుతున్నది. ఇది ఫలించి మమతా బెనర్జీ దేశాధికార దండాన్ని సాధించుకోగలిగితే హర్షించవలసిందే. అలా కాకుండా కాంగ్రెస్‌ని దూరం చేసి, దానిని మరింతగా బలహీనపరిచి బిజెపి మళ్లీ అధికారంలోకి రాడానికే మమతా బెనర్జీ తోడ్పడితే అదొక ప్రహసనంగా చరిత్రలో మిగిలిపోతుంది.