ఇడి, సిబిఐ జాడలేదేందుకు ?
ప్రాణనష్టంపై జుడిషియల్ విచారణ అవసరం
బాధ్యులను శిక్షించాలి..జవాబుదారితనం కనబర్చాలి
మోర్బీ వంతెన కూలడంపై మమత బెనర్జీ స్పందన
కోల్‌కతా : గుజరాత్‌లో అత్యంత ఘోరమైన మోర్బీ తీగల వంతెన ప్రమాదం జరిగితే, అనేక మంది చనిపోతే ఈ ఘటనపై కనీస దర్యాప్తు కూడా జరగదా? అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిలదీశారు. పలు విషయాలపై కేంద్రం సిబిఐ, ఇడి దర్యాప్తు అంటుంది కదా. మరి ఈ ఘటనపై వీటి జాడ ఏదీ ? అని ప్రశ్నించారు. దాదాపు 150 మంది వరకూ ఈ దుర్ఘటనలో మృతి చెందారు. అదీ గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్న దశలోనే జనం కదలాడే వంతెన కూలింది. పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాను పెద్దగా వ్యాఖ్యానించదల్చుకోలేదని ఇతరులలాగా దీనిని రాజకీయం చేయబోనని, అయితే మనుష్యుల ప్రాణాలను బలిగొన్న ఘటనకు జవాబుదారిఎవరవుతారు? దీనికి సమాధానం కావాలని వ్యాఖ్యానించారు. ఇటీవలే మోర్బీలోని తీగల వంతెనపై లెక్కకు మించిన జనం చేరడం, వంతెన కుప్పకూలడం ఇప్పటివరకూ ఎందరు దుర్మరణం చెందారు.
నదిలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయి? అనేది నిర్థారణ కాని విషయంగా మారింది. ఇంత పెద్ద భారీ ప్రమాదం విషాదంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జుడిషియల్ దర్యాప్తు చేపట్టాల్సి ఉందని మమత బెనర్జీడిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని , ఎందరో మృతి చెందారు. పలువురి జాడ తెలియడం లేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ, ఇడిలు సామాన్య జనంపై వేధింపులకు దిగుతుంటారు కదా? మరి ఈ ప్రమాదానికి బాధ్యులను గుర్తించి వారిని నేరస్తులుగా నిర్థారించి ఎందుకు శిక్ష విధించడం లేదని, కనీసం ఈ దిశలో దర్యాప్తు ఎందుకు చేపట్టడం లేదని మమత ప్రశ్నించారు. దుర్ఘటనకు ఎవరు బాధ్యులనేది గుర్తించాల్సి ఉందని తెలిపారు. తాను ఈ విషాదం విషయంలో రాజకీయాలకు పోవడం లేదని, అంతేకాకుండా ప్రధాని స్వరాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ప్రధాని ఏ విధంగా స్పందిస్తున్నారనేది కూడా అడగదల్చుకోలేదని, ఇది చివరికి రాజకీయ రంగు పులుముకుంటుందని, ముందు జరిగిన దారుణం నిజానిజాలు తేల్చాల్సి ఉంటుందని మమత స్పష్టం చేశారు.