కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు బిజెపి ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ నెల 30న జరిగే ఉప ఎన్నిక కోసం మమత గత వారం నామినేషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసుల వివరాలు నామినేషన్ పత్రాల్లో తెలియజేయకపోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని బిజెపి అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సజల్‌ఘోష్ అన్నారు. అసోంలోని పలు పోలీస్ స్టేషన్లలో మమతపై కేసులున్నాయని ఆయన ఆరోపించారు.
ఈమేరకు తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టినందుకు మమత నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తుందని ఆయన అన్నారు. అయితే,కాషాయపార్టీవి ఆధారంలేని ఆరోపణలని బెంగాల్ రవాణాశాఖమంత్రి ఫిర్హాద్ హకీమ్ కౌంటరిచ్చారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మమతపై బిజెపి ఇలాంటి ఫిర్యాదే చేయగా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. దాంతో, ఆరోపణలు వాస్తవం కాదని అంతా భావిస్తున్నారు. కాగా, ఆ ఎన్నికల్లో నందిగ్రాం నుంచి పోటీపడ్డ మమత బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో తిరిగి ఉప ఎన్నికల్లో నిలబడ్డారు.