ఫరక్కా : లోక్‌సభ ఎన్నికల తొలి విడత , రెండో విడతల్లో ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటించడం ,ఇందులో ఓటర్ టర్న్‌అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పశ్చిమబెంగాల్ లోని ఫరక్కాలో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ,పలు ఈవీఎంల జాడ తెలియకుండా పోవడంతో ఫలితాలను బీజేపీ తారుమారు చేసే అవకాశాలున్నాయనే సందేహం కలుగుతోందన్నారు.
తొలి, రెండో విడత ఫైనల్ టర్న్‌అవుట్‌ను ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. రెండు విడతల్లోనూ ఓటింగ్ శాతం 66 శాతానికి పైగా ఉంది. ఇంతకు ముందు పోలింగ్ లెక్కలతో పోలిస్తే ఈసీ తుది జాబితాలో ఓటింగ్ శాతం 3 నుంచి 4 శాతం పెరిగింది. ఈసీ ప్రకటించిన తుది జాబితా ప్రకారం తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 66.71 శాతం నమోదైంది. రెండు దశలకు సంబంధించి రాష్ట్రాల పరంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ జాబితాను ఈసీ విడుదల చేసింది.