Wednesday, January 22, 2025

గవర్నర్‌తో చర్చలు ఫలప్రదం

- Advertisement -
- Advertisement -

విసిల నియామకంపై మమతా బెనర్జీ వెల్లడి

కోల్‌కత: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ చాన్సలర్ల నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని సమాశం అనంతరం ముఖ్యమంత్రి మమత విలేకరులకు తెలిపారు. వైస్ చాన్సలర్ల నియామకాల కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల గురించి గవర్నర్‌తో చర్చించారా అన్న ప్రశ్నకు మమత సమాధానం చెప్పలేదు.

సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశం సజావుగా సాగిందని, చర్చలు ఫలప్రదమయ్యాయని మాత్రం మమత విలేకరులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలలో వైస్ చాన్సలర్ల నియామకంతోసహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ ఆనంద బోస్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడి ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్టవిరుద్ధమని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ గతంలో ఆరోపించింది.

తమను సంప్రదించకుండా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఉన్నత విద్యా శాఖ తప్పుపట్టింది. కాగా..గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తమ మధ్య విమర్శలు, ఘర్షణ ఉండకూడదని, గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయనడం అవాస్తవమని మమత విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News