సిట్టింగ్ ఎంఎల్‌ఎ రాజీనామా, స్పీకర్ ఆమోదం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిఎంగా బాధ్యతలు స్వీకరించడంతో దీదీ మళ్లీ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు రెండు సార్లు పోటీ చేసి గెలుపొందిన భవానీపూర్‌నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తృణమూల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ, సీనియర్ నేత శోభనాదేబ్ చటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు పంపగా ఆమోదించారు. రాష్ట్ర మత్రి పార్థా చటర్జీ సమక్షంలో చటోపాధ్యాయ తన రాజీనామా లేఖను స్పీకర్ బిమన్ బందోపాధ్యాయకు సమర్పించారు. రాష్ట్ర అసెంబ్లీకి బయలుదేరి వెళ్లే ముందు చటోపాధ్యాయ పిటిఐతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి సంతోషంగా కట్టుబడతానని చెప్పారు.
అయితే మమత మళ్లీ పోటీ చేయడంపై ఎలాంటి వివరాలు చెప్పడానికి టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ నిరాకరించారు. తగిన సమయంలో పార్టీ దీనిపై ఒక ప్రకటన చేస్తుందని మాత్రమే ఆయన చెప్పారు. బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అయితే నందిగ్రామ్‌నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ మాత్రం తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ మమతా బెనర్జీనే తృణమూల్ నేతలు తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆమె మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆరు నెలల లోపు ఏదో ఒక స్థానంనుంచి మమతా బెనర్జీ గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అందువల్ల ఇప్పటికే రెండు సార్లు గెలుపొందిన భవానీపూర్‌నుంచే పోటీ చేయడానికి మమత మొగ్గు చూపారు.