మోడీ ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఇక్కడి సర్కార్‌ను అవమానిస్తూనే ఉన్నారు
ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చర్యలు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు
బిజెపికి మమత తీవ్ర హెచ్చరిక
చీఫ్ సెక్రటరీ రీకాల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోడీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా యాస్ తుపానుపై ప్రధాని, సిఎంల మధ్య జరిగిన సమావేశం మరోసారి వీరిమధ్య పోరుకు వేదిక అయింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపిస్తూ, చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్‌ను వెనక్కి పిలిపిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, కరో నా సంక్షోభంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఆయనను కొనసాగించాలని కోరారు. బెంగాల్‌కు మేలు చేస్తానంటే ప్రధాని కాళ్లు పట్టుకోవడానికైనా తను సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్ ప్రజలను, తనను అవమానపర్చవద్దని బిజెపికి, ప్రధాని మోడీకి ఆమె తేల్చి చెప్పారు.
మేమూ వేచి ఉన్నాం
యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటన సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ప్రధాని సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలస్యంగా రావడం ద్వారా ప్రధానిని అరగంట సేపు వేచి ఉండేలా చేశారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై వాస్తవాలను వెల్లడించేందుకు మమత శనివారం ప్రత్యేకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని తాను ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని ఆమె తెలిపారు. ఇంతలోనే ప్రధాని పర్యటన ఉందని తెలియగానే.. ఆయన హెలికాప్టర్ దిగే స్థలానికి వెళ్లి ఎదురు చూశామని, ఆ తర్వాత ఆయనను కలిసేందుకు వెళితే ప్రధాని మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో 20 నిమిషాల పాటు వేచి ఉన్నామని తెలిపారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాలులో ప్రధాని, సిఎంల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి నివేదిక సమర్పించి ఆయన అనుమతితోనే అక్కడినుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లానని చెప్పారు.
ఎందుకీ అవమానం?
ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని గుజరాత్, ఒడిశాలలో పర్యటించారు. ఆ రాష్ట్ర సిఎంలతో సమావేశమైనారు. అయితే ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆహ్వానించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. ఇటీవల బెంగాల్‌లో ఎదురైన ఘోర ఓటమిని బిజెపి జీర్ణించుకోలేక పోతోందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్ ప్రజలను అవమానించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఎప్పుడు బెంగాల్‌కు వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని, సిఎంల మీటింగ్‌కు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న వెర్షన్‌నే బిజెపి ప్రచారంలోకి తెచ్చి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని సిఎం చెప్పారు. అందుకే ఆ మీటింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తున్నానని స్పష్టం చేశారు.
Mamata Responds on Yaas Review Meet With PM Modi