బిజెపితో పోటీపడలేక తమతోనా..?
టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ
పనాజి: కాంగ్రెస్ వల్లే ప్రధాని మోడీ శక్తిమంతమైన నాయకుడిగా కొనసాగుతున్నారని టిఎంసి అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే దేశం ఇబ్బందులనెదుర్కోవాల్సి వస్తున్నదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోటీపడి వారిని వారు రుజువు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలుండగా, వాటిని వినియోగించుకోలేకపోతున్నారన్నారు. తన రాష్ట్రంలో తనపై పోటీ చేసినవారి దగ్గరికి పూలు, మిఠాయిలు ఎలా తీసుకువెళ్లగలమని ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలు బలపడాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రాలు దృఢంగా ఉంటేనే కేంద్రం దృఢంగా ఉంటుందన్నారు. గోవాను గెలుచుకోగలిగితే దేశాన్నీ గెలవగలమన్నారు.
గోవా ఫార్వార్డ్‌బ్లాక్(జిఎఫ్‌పి) అధ్యక్షుడు విజయ్‌సర్దేశాయ్‌తో చర్చించిన అనంతరం మమత ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పోరాడాలనుకునే ప్రాంతీయ పార్టీలు టిఎంసితో కలిసి పని చేయాలని ఆమె సూచించారు. తాము బలమైన సమాఖ్య నిర్మాణాన్ని కోరుకుంటున్నామని మమత అన్నారు. బయటివారి దాదాగిరీని తాము కోరడం లేదన్నారు. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏమీ తమకు లేదని ఆమె అన్నారు. టిఎంసి తరఫున రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో జిఎఫ్‌పి నేతలు ఇప్పటికే చర్చించారు. జిఎఫ్‌పిని టిఎంసిలో విలీనం చేసే ఆలోచన ఏమీ లేదని తెలుస్తోంది. కూటమి లేదా విలీనం అన్నది వారి ఇష్టమంటూ సర్దేశాయ్‌తో చర్చల అనంతరం మమత వ్యాఖ్యానించారు.