కేంద్రం ఎన్నికల డ్రామా ఇదంతా
పశ్చిమ బెంగాల్ సిఎం మమత
రూ 800 వంటగ్యాసు ఏ పేదలకు ?
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఇంధనంపై వ్యాట్ కోతల ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సోమవారం తేల్చిచెప్పారు. ఎక్సైజ్ సుంకాల రూపంలో కేంద్రం కోట్లాది రూపాయలు గడిస్తోందని విలేకరుల సమావేశంలో తెలిపారు. వంటగ్యాసుపై సబ్సిడీల పునరుద్ధరణ, తాజాగా పెట్రోలు డీజిల్ ధరల తగ్గింపు ఇవన్నీ కూడా బిజెపి ఎన్నికల ఎత్తుగడలని, త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధిపొందేందుకు ఈ తగ్గింపులకు దిగిందని అన్నారు. గుజరాత్‌లో ఓడుతామనే భయం బిజెపికి పట్టుకుందని, అందుకే ఇంతకాలం పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను దించుతున్నారని తెలిపారు. బెంగాల్‌లో వ్యాట్ తగ్గింపు ప్రసక్తే లేదన్నారు. ఇంధనంపై వ్యాట్ తగ్గించడానికి వీల్లేదని తమ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. దండిగా సొంతంగా ఆదాయం సంపాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల ఆర్థిక వనరులకు గండికొడుతోందని విమర్శించారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలోని సమాఖ్య నిర్మాణ వ్యవస్థ దెబ్బతిందని మమత బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర జోక్యం మితిమీరిందని, కేంద్ర సంస్థలు నేరుగా రాష్ట్ర అంశాలలో కలుగచేసుకుంటూ ఫెడరల్ విధానానికి తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. కేంద్రం గుప్పిట్లో నుంచి దర్యాప్తు సంస్థలు విముక్తం కావాల్సి ఉందని వాటికి అటానమీ కల్పించాలని కోరారు. కేంద్రంలో కాషాయ పార్టీ పాలన ఇప్పుడు హిట్లర్, స్టాలిన్ లేదా ముస్సోలిన్‌ల పాలనను మించి నిరంకుశం అయిందన్నారు. ఉజ్వల యోజనను ఇప్పుడు కేంద్రం ఎన్నికలకు ముందు తిరిగి తీసుకువచ్చిందని, బిపిఎల్ కేటగిరిలోని వారికి రూ 200 సబ్సిడీని పునరుద్ధరించిందని, నిరుపేదలు వంటగ్యాసును రూ 800 పెట్టి కొనుక్కుంటారా? అని ప్రశ్నించారు.