కోల్‌కతా : ఈ నెల ఆరో తేదీ బుధవారం ఇండియా కూటమి సమావేశం కావడానికి నిర్ణయమైనా, ఆ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. అదే రోజు ఉత్తరబెంగాల్‌లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొనవలసి రావడమే కారణంగా తెలుస్తోంది. అదీకాక కూటమి సమావేశం గురించి తనకు తెలియదని మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
“ ఈ కూటమి సమావేశం గురించి నాకు తెలియదు. కోల్‌కతా లో ఓ కార్యక్రమానికి ముందస్తు షెడ్యూల్ ఉంది. అక్కడ నాకు ఏడు రోజుల కార్యక్రమం ఉంది. ఒకవేళ నాకు ముందే సమావేశం గురించి తెలిసి ఉంటే నా కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే దాన్ని.. ” అని మమతాబెనర్జీ చెప్పారు. మద్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం, కాంగ్రెస్ ఓటమిపై చర్చించడానికి వచ్చే బుధవారం కూటమి సమావేశం నిర్వహించడానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.