కోల్‌కతా: గసగసాల సాగును అనుమతించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బెంగాలీ వంటకాలలో గసగసాలు వాడడం, రుచికరమైన వంటకాలు తయారుచేయడం అంతర్భాగమని ఆమె అన్నారు. కొన్ని రాష్ట్రాలలోనే పండిస్తున్నందున ‘పోస్టో’ లేక గసగసాలు చాలా ఖరీదైనవని ఆమె అన్నారు.
‘బెంగాళీలో గసగసాలను ఇష్టపడతారు. బెంగాల్‌లో గసగసాలను పండించేందుకు కేంద్రం అనుమతించాలన్నారు. బెంగాలీ వంటకాలలో గసగసాలు వాడడం మామూలే’ అన్నారు. ‘బెంగాల్ ఎందుకు ఎక్కువ ధర పెట్టి ఇతర రాష్ట్రాలలో పండించే గసగసాలు కొనాలి? గసగసాలను సాగుచేయడానికి బెంగాల్‌కు ఎందుకు అనుమతించరు? ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాయాల్సిందిగా నేను ప్రతిపక్షాలను కోరుతాను’ అని గురువారం మమతా బెనర్జీ తెలిపారు. ‘మాకు మా రాష్ట్రంలో గసగసాలను పండించుకునేందుకు అనుమతిస్తే కిలో రూ. 1000కి బదులుగా మాకు రూ. 100కే దొరుకుతుంది’ అని ఆమె వివరించారు. ఆహారం, సరఫరా శాఖకు సంబంధించిన బడ్జెట్‌పై ఆమె చర్చిస్తున్న సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. కేంద్రం ఇప్పటికే ‘బాస్మతి’ బియ్యంపై పన్ను రాయితీ ఇచ్చిందని, దానిని పశ్చిమ బెంగాల్‌లో ఉత్పత్తి చేసే ‘గోబిందోభోగ్’, ‘తులైపంజీ’ రకాల బియ్యాలకు కూడా వర్తింపజేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.