Monday, December 23, 2024

మమత.. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -
  • మమత ఇండియా కూటమిలో ‘కీలక భాగస్వామి’
  • సీట్ల పంపకం చర్చలు సాగుతున్నాయి
  • ఝార్ఖండ్ యాత్రలో రాహుల్ వెల్లడి
  • అభివృద్ధి పేరిట ఆదివాసీల భూములు స్వాహా
  • ఇప్పటికీ నిరుపయోగంగానే ఆ భూములు: రాహుల్ గాంధీ ఆరోపణ

గుమ్లా (ఝార్ఖండ్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో ‘కీలక భాగస్వామి’గా ఉన్నారని, కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపకం సంప్రదింపులు సాగుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా బసియాలో విలేకరుల గోష్ఠిలో రాహుల్ ఈ ప్రకటన చేశారు.

‘ఇతర సభ్యులు చాలా మంది వలె మమతాజీ కూడా ఇండియా కూటమిలో చురుకైన భాగస్వామి’ అని రాహుల్ తెలిపారు. సీట్ల పంపకం విషయమై కూటమి సభ్య పక్షాల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయని, ‘అది సాధారణమే’ అని ఆయన అన్నారు. తన పార్టీ టిఎంసి పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో జత కట్టి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోదని మమతా బెనర్జీ క్రితం వారం సుస్పష్టం చేసిన విషయం విదితమే. ఎన్నికలలో బిజెపికి సాయం చేసేందుకు కాంగ్రెస్ సిసిఐ(ఎం)తో చేతులు కలిపిందని మమత ఆరోపించారు.

కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరడంపై రాహుల్ మాట్లాడుతూ, ‘ఆయన నిష్క్రమణకు కారణాలు ఏవై ఉంటాయో మీరు ఊహించవచ్చు. ఇండియా కూటమిలో భాగంగా బీహార్‌లో మేము పోరాడతాం’ అని చెప్పారు. ఇది ఇలా ఉండగా, దేశంలో అభివృద్ధి పేరిట ఆదివాసీల భూములను ‘లాక్కుంటున్నారు’ అని రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఝార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో మంగళవారం తిరిగి మొదలైంది.

రాష్ట్రంలోని పూర్వపు బిజెపి ప్రభుత్వం ఎకరాల కొద్దీ ఆదివాసీల భూములను సమీకరించిందని, కాని అటువంటి వనరులు ‘నిరుపయోగం’గా ఉండిపోయాయని ఆయన చెప్పారు. గుమ్లా జిల్లాలో కాందారా చౌక్‌లో యాత్రలో భాగంగా రోడ్ షోలో సభికులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ, ‘ఝార్ఖండ్‌లోని పలువురు ఆదివాసీ మహిళలతో మాట్లాడాను. అభివృద్ధి పేరిట తమ భూమిని కైవసం చేసుకున్నారని, తుదకు కార్పొరేట్ సంస్థలకు లేదా ఎన్‌జిఒలకు అప్పగించారని తెలిపారు. ఇది ఆదివాసీలకు పెడ్ద సమస్య’ అని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం గతంలో భూ సమీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, దాని కింద గ్రామ సభ అంగీకారం లేకుండా ఏ ఆదివాసీ భూమినీ స్వాధీనం చేసుకోరాదని రాహుల్ చెప్పారు.

‘ఆ చట్టం నిబంధనల ప్రకారం, ఒక వేల వారి భూమిని తీసుకున్నా మార్కెట్ రేటుకు నాలుగింత పరిహారాన్ని వారికి ఇవ్వవలసి ఉంటుంది. అలా సేకరించిన భూమిని ఐదు సంవత్సరాల పాటు ఉపయోగించుకోని పక్షంలో ఆ భూమిని అసలు యజమాని పరం చేయవలసి ఉంటుంది’ అని రాహుల్ వివరించారు. ఝార్ఖండ్‌లోని పూర్వపు బిజెపి ప్రభుత్వం ‘భూమి బ్యాంకుల సృష్టి కోసం లక్షలాది ఎకరాల ఆదివాసీ భూములు సేకరించింది. కాని, అటువంటి వనరులు నిరుపయోగంగా ఉండిపోయయాయి’ అని ఆయన ఆరోపించారు. ‘ఇప్పుడు ఆదివాసీలు తమ భూమిని తిరిగి తమకు ఇవ్వాలని కోరుతున్నారు’ అని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News