Saturday, December 21, 2024

నీతి ఆయోగ్ భేటీ నుంచి మమత వాకౌట్

- Advertisement -
- Advertisement -

ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేశారని ఆరోపణ
మమత వాదనకు ప్రభుత్వం ఖండన
ఆమె ప్రసంగం సమయం ముగిసిందని స్పష్టీకరణ
ఆమె ఆరోపణ సరి కాదన్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు, ప్రతిపక్షాల నుంచి తాను ఏకైక ప్రతినిధిని అయినప్పటికీ తన ప్రసంగాన్ని మధ్యలో అన్యాయంగా నిలిపివేశారని మమత ఆరోపించారు. అయితే, ఆమె ఆరోపణను ప్రభుత్వం తిరస్కరించింది. మమత ప్రసంగం సమయం ముగిసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ముఖ్యమంత్రులను ఎక్కువ సేపు మాట్లాడనివ్వగా ఐదు నిమిషాల అనంతరం తన మైక్‌ను స్విచాఫ్ చేశారని మమత ఆరోపించారు. ‘ఇది అవమానకరం. నేను ఇక మరే సమావేశానికీ హాజరు కాను’ అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత చెప్పారు.

‘సమావేశాన్ని బహిష్కరించి నేను వెలువలికి వచ్చాను. (ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి) చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారు. అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 10, 12 నిమిషాల సేపు మాట్లాడారు. కేవలం ఐదు నిమిషాల తరువాత నన్ను మాట్లాడనివ్వలేదు’ అని మమత సమావేశంలో నుంచి బయటకు వచ్చిన తరువాత విలేకరులతో చెప్పారు. ‘ఇది అన్యాయం. ప్రతిపక్షాల నుంచి నేను ఒక్కదానినే వచ్చాను. సహకార సమాఖ్యతత్వాన్ని పటిష్ఠం చేయాలన్న ఆసక్తి కారణంగానే ఈ సమావేశానికి హాజరయ్యాను’ అని మమత తెలిపారు. అయితే, మమత వాదన అవాస్తవమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ‘ప్రతి సిఎంకు మాట్లాడేందుకు వారికి సముచిత సమయం ఇచ్చారు& తన మైక్‌ను స్విచ్చాఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడం దురదృష్టకరం. మైక్ స్విచ్చాఫ్ చేశారన్నది నిజం కాదు’ అని నిర్మల అన్నారు.

కాగా, మమత మైక్రోఫోన్‌ను స్విచ్చాఫ్ చేశారన్నది ‘తప్పుదోవ పట్టించడమే’ అని పిఐబి ఫ్యాక్ట్‌చెక్ ‘ఎక్స్’ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ‘ఆమె ప్రసంగం సమయం ముగిసిందని మాత్రమే గడియారం చూపించింది’ అని అది తెలిపింది. మాట్లాడేందుకు అక్షరక్రమంలో మమత వంతు లంచ్ తరువాత రావలసి ఉందని, కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి అధికారిక అభ్యర్థనను పురస్కరించుకుని ఏడవ వక్తగా ఆమెకు అవకాశం ఇచ్చారని అధికార వర్గాలు తెలియజేశాయి. మమత త్వరగా కోల్‌కతాకు తిరిగి వెళ్లవలసి ఉన్నందున బెంగాల్ ప్రభుత్వం ఆ విజ్ఞప్తి చేసిందని ఆ వర్గాలు వివరించాయి. బిజెపి నాయకత్వంలోని కేంద్రం రాజకీయ వివక్షతో కూడిన బడ్జెట్ ప్రతిపాదించినట్లు తాను సమావేశంలో పేర్కొన్నానని, కేంద్రం రాష్ట్రాల పట్ల ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించానని మమత తెలియజేశారు. ‘వారికి రాజకీయ పక్షపాతం ఉంది.

వారు విభిన్న రాష్ట్రాల పట్ల సరైన శ్రద్ధ వహించడం లేదు. తుదకు బడ్జెట్ కూడా రాజకీయ వివక్షతో కూడిన బడ్జెట్’ అని ఆమె ఆరోపించారు. ‘కొన్నిరాష్ట్రాల పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వారు ఇతర రాష్ట్రాల పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించాను. వారు ఆదేశాలు మాత్రమే ఇస్తుంటే పని చేస్తున్నది మేమేనని చెప్పాను’ అని మమత పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌కు ఆర్థికపరమైన అధికారాలు ఏవీ లేవని, దానికి ఆ అధికారాలు ఇవ్వనైనా ఇవ్వాలి లేదా ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి అని కూడా ఆమె అన్నారు. ‘ప్రణాళికా సంఘం రాష్ట్రాల కోసం ప్రణాళికలు రూపొందిస్తుండేది.

నీతి ఆయోగ్ ఆర్థిక అధికారాలు ఏవీ లేవు. అది ఎలా పని చేస్తుంది? దానికి ఆర్థిక అధికారాలు ఇవ్వండి లేదా ప్రణాళికా సంఘాన్ని తిరిగితీసుకురండి’ అని ఆమె సూచించారు. ‘ఎంజిఎన్‌రెగా, (ప్రధాన్ మంత్రి) ఆవాస్ (యోజన) నిధులను మూడు సంవత్సరాల పాటు (పశ్చిమ బెంగాల్‌కు) నిలిపివేశారు. వారు తమ పార్టీ, ఇతరుల మధ్య వివక్ష చూపాలనుకుంటే దేశం ఎలా నడుస్తుంది? వారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది’ అని మమత చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పశ్చిమ బెంగాల్ సిఎంకు మద్దతు ప్రకటించారు. ‘ఇదిసహకార సమాఖ్యతత్వమా? ఒక ముఖ్యమంత్రి పట్ల ఇలాగేనా వ్యవహరించేది? మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అంతర్భాగమని కేంద్ర బిజెపిప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వాటిని శత్రువులుగా చూడడం ఆపివేయాలి’ అని స్టాలిన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘సహకార సమాఖ్యతత్వానికి చర్చలు, అందరి అభిప్రాయాల పట్ల మన్నన అవసరం’ అని స్టాలిన్ సూచించారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్ (డిఎంకె), పినరయి విజయన్ (కేరళ సిపిఐఎం), భగవంత్ మాన్ (పంజాబ్ ఆప్). సిద్ధరామయ్య (కర్నాటక కాంగ్రెస్), సుఖ్విందర్ సింగ్ సుఖు (హెచ్‌పి కాంగ్రెస్), రేవంత్ రెడ్డి (తెలంగాణ కాంగ్రెస్), హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్ జెఎంఎం) నీతి ఆయోగ్ సమావేశానికి గైర్ హాజరయ్యారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలను అలక్షం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. భారత్‌ను 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై సమావేశం దృష్టి కేంద్రీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News