రాజీ రాజకీయంపై జోరుగా ప్రచారం
కోల్‌కతా/న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగస్టు మొదటివారంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని ప్రచారం జోరందుకుంది. కేంద్రం పట్ల ఇటీవల మమత వైఖరి మారిందా? అనే సంకేతాల నడుమ ఇప్పటివరకూ పడని తీరున ఉండే ఈ ఇరువురు నేతల మధ్య భేటీ ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 7వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి కీలక సమావేశం విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతుంది.ఈ భేటీకి ఇతర సిఎంలతో పాటు మమత కూడా హాజరవుతారు. ఈ దశలోనే టిఎంసి అధినేత్రి అయిన మమత తన రాజకీయ హోదాలో విడిగా మోడీని కలుస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ ఇటీవలే టీచర్ల నియామక ప్రక్రియ సంబంధిత అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. ఆయన వ్యక్తిగత సహాయకురాలి నివాసంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు సంచలనానికి దారితీశాయి. అవినీతి పనులను సహించేది లేదని, ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని ఇటీవలే మమత బెనర్జీ తెలిపారు.
పైగా ఉప రాష్ట్రపతి పదవికి విపక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో తాను ఇతర ప్రతిపక్షాల వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు , తన అభిప్రాయం తీసుకోకుండానే అభ్యర్థి పేరు ప్రకటించడం జరిగిందని తెలియచేస్తూ, ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఓటింగ్‌కు టిఎంసి దూరంగా ఉంటుందని కూడా మమత ప్రకటించారు. ఆగస్టు 6వ తేదీనే మమత ఢిల్లీకి చేరుకుంటారు. అదే రోజు కానీ మరుసటి రోజు కానీ మోడీని ఆయన నివాసంలో మమత కలుసుకుంటారా? లేక రాష్ట్రపతి భవన్‌లో కలుస్తారా? అనేది వెల్లడికాలేదు. నివాసంలో కలిస్తే ఇది రాజకీయాలలో ప్రత్యేక అంశంగా మారుతుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలకు గత ఏడాది మమత హాజరు కాలేదు. ఈసారి ఆమె తప్పనిసరిగా హాజరవుతారని స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ ధన్‌ఖర్ స్థానంలో బెంగాల్ గవర్నర్ నియామకం జరగలేదు. వివాదాస్పదుడు అని తిట్టిపోసిన ధన్‌ఖర్ తేలిగ్గా ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు మమత పార్టీ ఓటింగ్ బహిష్కరణ తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అవినీతి అరెస్టుల నేపథ్యంలో మోడీ మమత విడి భేటీ అపూర్వ తరహాలోనే ఉంటుందని భావిస్తున్నారు.