నందిగ్రామ్: తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై గందరగోళం నెలకొన్నది. మొదట ఈ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలిచినట్లు భావించారు. కానీ చివరికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచినట్లు తెలిసింది. మొదట 1200 ఓట్లతో ఇక్కడ మమత గెలిచినట్లుగా మీడియా అంతా ప్రచారం చేసింది. అయితే చివరికి సువేందు 1956 ఓట్లతో గెలిచినట్లు తెలుస్తోంది. ఈ ఫలితం ప్రకటించకూడదని ఈసీని టీఎంసీ కోరింది. ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ కూడా మీడియాతో మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో ఓడిపోయినట్లు పరోక్షంగా చెప్పారు. నందిగ్రామ్ గురించి బాధపడొద్దు. అక్కడ ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి.. నందిగ్రామ్‌లో పోరాడాను. నందిగ్రామ్ ప్రజలు ఏ తీర్పు అయినా ఇవ్వనీ. దానిని నేను అంగీకరిస్తాను. నేనేమీ పట్టించుకోను. మనం 221 సీట్లకుపైగా గెలిచాం.. బీజేపీ ఓడిపోయింది అని మమతా అన్నారు.