Wednesday, November 6, 2024

మో‘ఢీ’నే… మమతదే గెలుపు

- Advertisement -
- Advertisement -

Mamata's victory in Bengal: Prashant Kishor

 

బెంగాలీ నాడీ బలోపేతం
ఫిరాయింపుల ప్రభావం ఉండదు
కీలకమైన ఎస్‌సి ఓట్లలో మార్పులేదు
ఓటర్ల విడదీతలో బిజెపి ఎదురీత
అసెంబ్లీ ఎన్నికల్లో పాపులార్టీ తేడాలు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తిరిగి ప్రముఖంగా విన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమత బెనర్జీ పార్టీ టిఎంసిని, తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె కూటమికి విజయం అందించేందుకు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ విజయం కోసం చాలా నెలల నుంచే అమిత్ షా, ప్రధాని మోడీ రాజకీయ వ్యూహాలకు దిగుతూ వస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి టిఎంసి నుంచి బిజెపిలోకి అత్యంత ప్రముఖుల వలసలు సాగుతూ వచ్చాయి. అయితే బెంగాల్‌లో బిజెపి రెండంకెల సంఖ్య బలాన్ని దాటబోదని, అధికారం ఎండమావి అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నేతల పలుకుబడి, వారికి ప్రజలలో ఉన్న గుర్తింపు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని కిషోర్ అంగీకరించారు. పేరు, ప్రతిష్టలను బట్టి మోడీకి జాతీయ స్థాయిలో ఎన్నికల వేళ తగు ఫలితం ఉండొచ్చు అని, అయితే బెంగాల్‌లో జనం నాడి వేరని , ఎక్కడైనా ఎవరికైనా తమ రాజకీయ ఉనికిని ఏ విధంగా చాటుకున్నారనేదే కీలకం అవుతుందన్నారు. బెంగాల్‌లో ఈసారి షెడ్యూల్ కులాల ఓట్లే కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు.

బెంగాల్‌లో ఇప్పుడు ఎన్నికలు మమత వర్సెస్ మోడీగా మారాయన్నారు. పార్టీల ఫిరాయింపులు, ఎన్నికల ముందురోజుల్లో పార్టీలు మారిననేతల గురించి ఎవరూ పట్టించుకోబోరని, టిఎంసి నుంచి తమవైపు వచ్చిన నేతలతో లాభం జరుగుతుందని బిజెపి భావిస్తోందని, అయితే వీరి ప్రభావం ఉండదని, పైగా ప్రతికూలత ఏర్పడుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు బిజెపి జోరుగా ప్రజలలో భయాలను కల్పిస్తుందని, బిజెపి విజయం సాధించకపోతే బెంగాలీలకు నష్టం ఉంటుందని ప్రచారానికి దిగుతుందన్నారు. అయితే ఏ కారణం చేతనైనా బెంగాల్‌లో టిఎంసి ఓడిపోతే అధికారం నిలబెట్టుకులేకపోతే ఇండియా ఇక ఒక దేశం, ఒక పార్టీ వైపు దారితీస్తుందని, ప్రజల జీవితాలపై బిజెపి ఆధిపత్యం సంపూర్ణం అవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

బెంగాల్‌లో జాతీయ పార్టీల ప్రభావం లేదు

బెంగాల్‌లో గత 30 నుంచి 35 ఏండ్లలో ఎప్పుడూ అధికార పార్టీకి జాతీయ పార్టీలు సవాళ్లు విసరలేదు. ఇక్కడ వామపక్ష కూటమి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి పోటీ ఏర్పడేలేదు. అయితే తొలిసారి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు బెంగాల్‌లో అధికారంలో ఉన్నపార్టీకి సవాలు విసురుతోంది. అధికార కైవసానికి శక్తియుక్తులను బలాన్ని వినియోగించుకొంటోంది. ప్రత్యేకించి కులాల సమీకరణలను బాగా వాడుకోవాలని చూస్తోందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలలో ఇక్కడ కులమే బలీయ ఓటు ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఎన్నికలకు బిజెపి భారీ స్థాయి ప్రాధాన్యతను, అంతకు మించిన హైప్‌ను తీసుకువచ్చింది. అయితే వాస్తవికంగా క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి మరో విధంగా ఉంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరు ఉంటే నెలకొనే తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు నెలకొన్న వార్ తక్కువే అన్నారు. తాను మొదటి నుంచి రాష్ట్రంలో బిజెపికి 20 లోపే స్థానాలు వస్తాయని చెపుతున్నానని, వారు 200 అంటున్నారని, అయితే ముప్పయి స్థానాలు వచ్చినా తాను ఎన్నికల వ్యూహకర్త స్థానం నుంచి వైదొలుగుతానని కిషోర్ సవాలు విసిరారు. బెంగాల్‌లో బిజెపి వ్యూహాల గురించి ప్రశాంత్ వివరించారు.

బెడిసికొట్టే బిజెపి ఐదంచెల పథకం

బిజెపి రాజకీయ వ్యూహకర్తలు బెంగాల్‌కు సంబంధించి ఐదు అంచెల కార్యాచరణతో ఉన్నారు. ఒకటి ఓటర్లలో విభజన ప్రక్రియ. రెండు మమత బెనర్జీ గౌరవ ప్రతిష్టను దెబ్బతీయడం. ఆమె పట్ల ఆగ్రహం నెలకొనేలా చేయడం, టిఎంసి రాజకీయ పతనావస్థలో ఉందని చెప్పడం, నాలుగో కీలక అంశం ఎస్‌సి ఓటర్ల మద్దతు దక్కించుకోవడం, ఐదోది మోడీ ప్రతిష్టను ఇక్కడ వాడుకోవాలని చూడటం అని కిషోర్ తెలిపారు. ఐదు అంశాలకు సంబంధించి బిజెపి వ్యూహాత్మకంగా విజయం సాధించినట్లు అనుకుంటూ ఉండొచ్చు. ప్రత్యేకించి హిందూ హిందేతర ఓటర్ల విభజన రేఖలు తెచ్చిపెట్టడంలో బెంగాల్‌లో బిజెపి విజయానికి అవసరం అయిన 50 నుంచి 55 శాతం లక్ష్మణరేఖలను గీయలేకపోయింది.

బెంగాల్‌లో 60 శాతం మెజార్టీ వర్గం ఓట్లు పడితే కానీ బిజెపి విజయం సాధించలేదని, ఇది యుపి గుజరాత్ ఇతర రాష్ట్రాల మాదిరిగా బెంగాల్‌లో సాధ్యం కాని పని అన్నారు. మమత బెనర్జీ ప్రతిష్టను దెబ్బతీయడం విషయానికి వస్తే ఇక్కడి రెండు పర్యాయాల ప్రభుత్వం పట్ల అధికార వ్యతిరేకత సహజమే. కొన్ని ప్రాంతాలలో ఇది తీవ్రస్థాయిలో ఉంది. అయితే టిఎంసి స్థానిక నేతలపై వ్యతిరేకత ఉంది కానీ మొత్తం మీద ఓటర్లు దీదీ (మమత బెనర్జీ) అధికారాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. మోడీకి దీదీకి మధ్య జరుగుతున్న పోరు కాబట్టి ఇక్కడి ఓటర్లు తిరిగి టిఎంసికి పట్టం కడుతారన్నారు. టిఎంసి నుంచి బిజెపిలోకి రాజకీయ వలసలతో పార్టీ పతనం చెందిందనే వాదన సరికాదన్నారు.

230 మంది ఎమ్మెల్యేలు, 40 మందికి పైగా ఎంపిలు ఉన్న పార్టీకి పాతిక అంతకు మించి అటూఇటుగా బలం తగ్గితే నష్టం ఉంటుందా? లేదా అనే ప్రశ్న వస్తుంది కానీ, పార్టీ పతనానికి దారితీసే అవకాశం లేదన్నారు. అన్నింటికి మించి రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి ఓటర్లు ప్రధాన సమస్య అవుతుందన్నారు. నమశూద్రులు,మతువాలు అత్యధికంగా ఎస్‌సి కోటాలోని వారు. వీరిని తమకు అనుకూలంగా మల్చుకోవాలని మోడీ, అమిత్ షా యత్నిస్తున్నారు. నిజానికి వీరు ఓట్లు రాబట్టుకోవడానికే పౌర సత్వ సవరణ చట్టం ప్రకటించారు. ఈ మధ్యలో బంగ్లాదేశ్‌కు వెళ్లి ప్రధాని మోడీ మతువా కాళికాలయాలకు వెళ్లి పూజలు చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే నమశూద్రులు బలంగా ఉన్న ప్రాంతాలలో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపికి విజయం దక్కలేదని, క్యా ఇతర విషయాలను వారు పట్టించుకోవడం లేదన్నారు.

మోడీ బాగా పాపులర్ కానీ …

మోడీకి ప్రజలలో ఆదరణ ఉంది. ఆయన పాపులర్ అనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నాని , అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాల్సి ఉంది. ఆయన బాగా ఆదరణ ఉన్న బిజెపి నేత. అయితే బెంగాల్ విషయానికి వస్తే ఇది చెల్లదు, ఇక్కడ దీదీతో పోలిస్తే ఆయన పాపులర్ కాదని ప్రశాంత్ తేల్చిచెప్పారు. ఇక్కడ జరుగుతున్నది ముఖ్యమంత్రి ఎన్నిక. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక కాబట్టి టిఎంసికి అంతకు మించి మమతకు బాగా కలిసి వస్తుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News