Thursday, December 19, 2024

మామునూర్ ఎయిర్ పోర్ట్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం రాష్ట్రమే నిర్మిస్తుంది
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా దాసరి హరిచందన
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: మామునూర్ ఎయిర్ పోర్ట్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మామునూర్ ఎయిర్ పోర్ట్‌కు అడ్డంగా మారిన 150 కిలోమీటర్ల దూరం నిబంధనను జిఎంఆర్ ఉపసంహరించుకునేలా అనేక సమావేశాలు నిర్వహించి ఒప్పించినట్టు మంత్రి తెలిపారు.

ఈ నెల 6వ తేదీన ఏవియేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎయిర్‌పోర్టుకు కావాల్సిన 280.30 ఎకరాల భూమిలో 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉన్నందున ఈ భూసేకరణపై అంచనాలు రూపొందించి కేబినెట్‌లో ఆమోదం పొందేలా చేశామని తద్వారా 205 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం అదిగో మామునూర్ ఎయిర్ పోర్ట్ అంటూ ఊరించిందని, కానీ, ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆయన ఆరోపించారు.

ఎనిమిది నెలల్లో మొదటిదశ పనులు పూర్తి

ఈ ఎయిర్ పోర్ట్‌ను రాబోయే 8 నెలల కాలంలో మొదటిదశను ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు. మొదటిదశలో మామునూర్ ఎయిర్ పోర్ట్‌ను స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక రెండో దశలో ఇంటర్ నేషనల్ విమానాలు (పెద్ద విమానాలు ఏ320, బి737), కార్గో విమానాలు నిలిపేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు వచ్చాయని మంత్రి ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్‌ను భవిష్యత్‌లో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు) ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు పెద్ద విమానాలను నడిపే విధంగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

రానున్న రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు

రానున్న రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధించి వాటి నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరవిమానయానశాఖ మంత్రి రాంమ్మోహన్ నాయుడుతో చర్చించామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ పార్టీ పదేండ్లలో సాధించని ఎయిర్ పోర్టులను నాలుగేళ్లలో సాధించి చూపిస్తామని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ టు -విజయవాడ రహదారి అభివృద్ధి

హైదరాబాద్ – టు విజయవాడ (ఎన్‌హెచ్ 65) విస్తరణ పనులు చేపట్టాలని తాను అడిగిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ హైవేను మంజూరు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డిపిఆర్ ఫైనల్ స్టేజీలో ఉందని, డిపిఆర్ పూర్తైన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ -టు విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని తద్వారా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళ్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ -టు భూపాలపట్నం ఎన్‌హెచ్ 163 పరిధిలో నిర్మిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆగష్టు 2018లో శంకుస్థాపన చేశారని గత ప్రభుత్వంలో కేవలం 30 శాతం పనులనను మాత్రమే పూర్తిచేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేశామని చెప్పుకొని తిరిగే బిఆర్‌ఎస్ నాయకులు నాలుగున్నర ఏళ్లలో ఉప్పల్ ఫ్లైఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

పది నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు 50 శాతం పూర్తి

వర్షాలు పడి రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది చనిపోవడం, క్షతగాత్రులై ఇబ్బందులు పడుతుంటే నాలుగున్నరేళ్లు ఏం చేశారని ఆయన నిలదీశారు. తాము వచ్చిన తర్వాత పనులు చేయని సంస్థను ఫోర్ క్లోజ్ చేసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి కొత్తగా పనులు ప్రారంభించామని, ఇప్పటికే పది నెలల్లోనే 50 శాతం పనులను పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి సిపిఆర్‌ఐ (సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) నారపల్లి వరకు దాదాపు 5 కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓర్ నిర్మాణంలో మేడిపల్లి నుంచి సిపిఆర్‌ఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని మంత్రి చెప్పారు. ఫ్లైఓవర్ పూర్తి కావడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు

శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుతమైన జాతీయ రహదారి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. చత్రపతి శివాజీ మహారాజ్ ప్రయాణించిన రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం రాష్ట్రమే నిర్మిస్తుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) ను 2017,-18లో ప్రారంభించారని, ఇప్పటిదాక ఒక్క పనిని కూడా మొదలు కాలేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్ లాంటి ఆర్‌ఆర్‌ఆర్‌ను గత ప్రభుత్వం నిర్లక్షం చేసిందన్నారు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందన్నారు. రాజకీయాల్లో ఈగోలకు తావులేదన్నారు. మనమంతా ప్రజల కోసం పనిచేస్తున్నామని, జవాబుదారీగా ఉండాలని ఆయన చెప్పారు ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు నిర్మాణం మొదట కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారని, కానీ, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీనిపై క్లారిటీ, కమిట్ మెంట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. దీంతో పనులు ఆలస్యం జరిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం జరుగుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం స్వయంగా నిర్మించాలనుకుంటుందన్నారు. ఈ రోడ్డును 6/8 లేన్‌లో ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో (ఢిల్లీ – ముంబాయి ఎక్స్ ప్రెస్ వే, ముంబయి టు -నాగపూర్ ఎక్స్‌ప్రెస్ వే, చెన్నై టు -కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ వే, గుజరాత్ స్టేట్ రీజనల్ రింగ్ రోడ్డు) నిర్మించినట్టుగా ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణంతో ఫోర్త్ సిటీకి, ఎయిర్ పోర్ట్‌కు కనెక్టివిటీ కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, లాజిస్టిక్, మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ అధ్యయనం, దానిని ప్రతిపాదించడం కోసం స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఆఫీసర్స్ కమిటీని నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీ మొదటి సమావేశం ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేశామని దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఐఏఎస్‌ను నియమించినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి, డిపిఆర్ ప్రిపరేషన్, కోసం టెండర్లు పిలవడానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో టెక్నికల్ అడ్వైయిజరీ, ఫైనాన్షియల్ అడ్వైయిజరీలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన డిపిఆర్ కన్సల్టెంట్స్ ఫీల్డ్ సర్వే చేసి అలైన్‌మెంట్‌ను ప్రతిపాదిస్తారన్నారు. ఇందులో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చేయాలి, అటవీశాఖ భూములు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతుల నుంచి భూసేకరణ చేయాలి వంటి అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తార మంత్రి తెలిపారు.

వరల్డ్ బ్యాంకు, జైకా, ఏడిబీలతో సంప్రదింపులు

ఫైనాన్సియల్ అడ్వైయిజర్ రోడ్డు నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంకు, జైకా, ఏడిబీ (ఎషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు) మొదలైన ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ఇప్పటి వరకు 94 శాతం భూసేకరణ పూర్తి చేశామని, వాస్తవానికి 80 శాతం భూసేకరణ పూర్తయితే టెండర్లు పిలవవచ్చు కానీ, ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదన్నారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఇంకా ఫైనల్ చేయలేదని మంత్రి తెలిపారు. భూసేకరణ పరిహారం విషయంలో రైతులకు నష్టం జరగకుండా మానవీయ కోణంలో వ్యవహారించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారన్నారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ఎన్‌హెచ్‌ఏఐకి పూర్తి సమాచారం, సహకారం అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఇక వాళ్ల చేతుల్లోనే ఉంటుందన్నారు.

1,862 హెక్టార్ల భూమి కోసం 3 డి నోటిఫికేషన్

రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం కొరకు 1,895 హెక్టార్ల భూమి సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,862 హెక్టార్ల భూమి కొరకు 3 (డి) నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన తెలిపారు. 1,320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డుల ప్రిపరేషన్ జరిగిందని, 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతుందన్నారు. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసుల్లో ఉందని, ఇవన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తామని మంత్రి తెలిపారు.

చట్టం తనపని తాను చేసుకుంటోంది…

తాము తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు వేసుకొని ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. నేడు వరంగల్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని ఆయన చెప్పారు. రైతుల ముసుగులో బిఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఇలాగే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లా అని ఆయన ప్రశ్నించారు. రేప్ కేసులో ఉన్న ఓ రౌడీ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఐఏఎస్‌పై దాడులు చేస్తుంటే ఖండించాల్సింది పోయి తమ కార్యకర్తేనని సిగ్గులేకుండా కెటిఆర్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళుతోందని, తమది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన ప్రకటించారు. అందుకే ప్రతిదీ చట్ట ప్రకారం జరుగుతుందని ఆయన తెలిపారు. వారిది కెసిఆర్ రాజ్యాంగమని అందులో న్యాయం, ధర్మం, చట్టం ఉండదని ఆయన ఆరోపించారు. వాళ్లకు నచ్చకపోతే జైలుకు పోయే పరిస్థితులను మనం కళ్లారా చూశామని ఆయన చెప్పారు.

అనేకసార్లు హౌస్ అరెస్టు చేశారు….

తాను ఎమ్మెల్యే, – ఎంపిగా ఉన్నపుడు కెసిఆర్ తనను అనేకసార్లు హౌస్ అరెస్టు చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రజలు పదవులు ఇచ్చింది ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి మేలు చేయడానికా? గల్లీలో ఉండడానికా? అని ఆయన ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే నల్గొండలో మూడు నెలలు పడుకొని కాళ్లు చేతులు వంకర కాకుండా హైదరాబాద్ వస్తరా అని మంత్రి కోమటిరెడ్డి ఛాలెంజ్ చేశారు? కిషన్ రెడ్డికి ఢిల్లీలో దోమల బాధకు తట్టుకోలేక హైదరాబాద్‌లో ఉంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై చంద్రబాబుతో కలిసి కెసిఆర్ కాల్పులు జరిపించి ఇప్పుడు రైతులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఆరోపించారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధీకరణ వద్దు ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు.

తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి

అనంతరం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ మొదటివారంలో పనులు పూర్తి చేసేలా అధికారులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. లక్షలమంది సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజల బాగుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేళశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News