మనతెలంగాణ/హైదరాబాద్: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, గజియాబాద్ కౌశాంబి తానా, వైశాలీకి చెందిన సువర్ణసు శేఖర్ సింగ్ బాధితురాలికి మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమయ్యాడు. బాధితురాలికి వివాహం చేసుకుంటానని ప్రతిపాదించడంతో యువతి నిరాకరించింది. దీనిని మనసులో పెట్టుకున్న నిందితుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఉద్యోగం కోసం సాయం చేస్తానని యువతిని నమ్మించాడు. తనపై యువతికి నమ్మకం వచ్చిన తర్వాత దుబాయ్‌లో భారీ వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీనికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పడంతో యువతి అంగీకరించింది. దుబాయ్‌లో ఉద్యోగం కోసం వీసా, ప్రాసెసింగ్ ఫీజ్, ఆఫర్ లెటర్ తదితరాల పేరు చెప్పి యువతి వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. తర్వాత నుంచి నిందితుడు స్పందించడం మానివేశాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్ రాము దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Man Arrested by Rachakonda Police for Cheating woman