సిటిబ్యూరోః యువతులు, మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న పోకిరీల భరతంపడుతున్నారు హైదరాబాద్, రాచకొండ పోలీసులు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులే కాకుండా బస్టాప్‌లు, కాలేజీలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి వేధింపులకు గురిచేస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు బాధితులు షీటీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా జైలు శిక్ష విధించారు. ఫ్లాట్ ఖాళీ చేయాలని వాచ్‌మెన్ భూతులు తిడుతుండడంతో బాధితురాలు మెయిల్ ద్వారా హైదరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది.
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీకి చెందిన రామచంద్రుడు, వాచ్‌మెన్‌ను అరెస్టు చేశారు. పోలీసులు కోర్టులో హాజరు పర్చగా ఎనిమిది రోజుల జైలు శిక్షపడింది. బాధితురాలిని అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను ఖాళీ చేయాలని వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రామచంద్రుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి తల్లి వృద్ధురాలిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకునివెళ్లాల్సిందిగా బెదిరిస్తున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న షీటీమ్స్ కోర్టులో హాజరుపర్చారు.
వివాహితుడి ట్రాప్…
తనకు వివాహం జరిగిన విషయం దాచి మరో యువతితో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసిన నిందితుడిని షీటీమ్స్ అరెస్టు చేశారు. ఎల్‌బి నగర్‌కు చెందిన ఆంజనేయులు అలియాస్ రాజుకు యువతి స్నాప్‌ఛాట్‌లో పరిచయం అయ్యింది. ఇద్దరు స్నేహితులగా మారడంతో ఐదేళ్ల నుంచి స్నేహం చేస్తున్నారు. రాజు యువతిని వివాహం చేసుకుంటానని చెప్పడంతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే బాధితురాలికి రాజుకు ఇప్పటికు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలకు కూడా ఉన్నారని తెలిసింది. దానిని దాచి తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని నిందితుడి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇల్లు ఖాళీ చేయించారని ఫోన్‌లో వేధింపులు….
తనను ఇల్లు ఖాళీ చేయించారని కోపం పెంచుకుని ఇంటి యజమానిని ఫోన్‌లో బెదిరించడమే కాకుండా తనకు ఆమెతో వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తున్న యువకుడిని షీటీమ్స్ అరెస్టు చేశారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ నగర్‌కు చెందిన వి. రాజ్‌కిరణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు, 2022లో ఇంటి యాజమానురాలితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఖాళీ చేయించింది. దీంతో కోపం పెంచుకున్న రాజ్‌కిరణ్ తనకు ఇంటి యజమానురాలితో వివాహేతరం సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ అసభ్యంగా తిడుతున్నాడు.
మీ కుటుంబం గురించి చెడ్డగా చెబుతానని ఫోన్ బెదిరించాడు. మరో కేసులో దంపతులను దూషించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇద్దరు భార్యభర్త బైక్‌పై వెళ్తుండగా ఆదిలాబాద్, లక్సెట్టిపేటకు చెందిన ఎండి షాబుద్దిన్ కారు డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవింగ్ చేశాడు. బైక్‌పై వెళ్తున్న వారిని భూతులు తిట్టాడు. బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు 8 రోజుల జైలు శిక్ష విధించింది.
న్యూడ్ వీడియోలతో వేధింపులు….
న్యూడ్ వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని షీటీమ్స్ అరెస్టు చేసి జైలుకు పంపారు. బెంగళూరుకు చెందిన మురళి మాదాపూర్‌లో ఉంటూ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నగరానికి చెందిన ఓ మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి భూతులు తిడుతున్నాడు. ఆమె వాట్సాప్ నంబర్‌కు న్యూడ్ వీడియోలు పంపిస్తున్నాడు. వాటిని బాధితురాలు బ్లాక్ చేస్తే వేరే నంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించింది.
రాచకొండలో ఆకతాయిలు 385
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న 385మందిని పోలీసులు గుర్తించారు. వారిలో 50మందిపై ఎఫ్‌ఐఆర్, 61 మందిపై పెట్టీ కేసులు, 118మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాచకొండ షీటీమ్స్ పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లు, రద్దీ ప్రదేశాల్లో ఫిబ్రవరీ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 385మంది ఆకతాయిలను అదపులోకి తీసుకున్నారు. భూమిక ఎన్‌జిఓ కౌన్సెలర్లు పోకిరీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆడవారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ అన్నారు. అవసరాల కోసం ఇంటి నుంచి బయటికి వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. కౌన్సెలింగ్ ద్వారా బాధ్యతగల పౌరులుగా మారే అవకాశం ఇస్తామని ఉమెన్ సేఫ్టీ డిసిపి శ్రీబాల అన్నారు.