Monday, January 20, 2025

చదివింది కంప్యూటర్ సైన్స్..చేసేది చోరీలు

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం : కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూర్ సైన్స్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు విలాసాలు, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో చోరీలు చేసిన కేసుల్లో జైలుకు పోయిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ అదే పనులు చేస్తుండటంతో వారిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసినట్లు వరంగల్ క్రైం డీసీపీ మురళీధర్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్‌కు చెందిన సునీల్ కాకతీయు విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలపై బెట్టింగ్‌లకు పాల్పడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని అన్నారు. ఆ వ్యసనాలకు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి డబ్బులను సులభంగా సంపాదించాలనుకున్నాడు. ఇందు కోసం సునీల్ మరో నిందితుడిని కలుపుకొని చోరీలకు సిద్దమయ్యాడు. 2020లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ, హన్మకొండ, మట్టేవాడ, ధర్మసాగర్, ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 15కు పైగా చోరీలకు పాల్పడ్డాడు.

2022లో సునీల్‌తో పాటు మరొకరిని సుబేదారి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించి అతనిపై పీడీయాక్ట్‌ను కూడా అమలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో జైలు నుండి విడుదలైన సునీల్ బెట్టింగ్ ఆడేందుకు మళ్లీ చోరీలకు పాల్పడి కొద్ది రోజులుగా డ్రైవర్‌గా పని చేస్తూ తన యజమానికి చెందిన ద్విచక్ర వాహనాలపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఏప్రిల్‌లో వడ్డేపల్లిలోని పరిమళ కాలనీలో చోరీకి పాల్పడ్డాడు. ఈ నెల 12న కోమటిపల్లి పోలీస్ కాలనీలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడి విలువలైన బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఈ చోరీలపై వరంగల్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఆదేశాల మేరకు సీసీఎస్, కేయూసీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితున్ని శనివారం కేయూసీ జంక్షన్‌లో తిరుగుతుండగా సమాచారం రావడంతో అనుమానస్పందగా కనిపిస్తున్న సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ద్విచక్ర వాహనంను, సునీల్‌ను తనిఖీ చేయగా నగదుతో పాటు తాళాలు పగలగొట్టే ఇనుప రాడ్లు గుర్తించి నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా వాటిని అంగీకరించినట్లు పోలీసులకు వివరించారు. నిందితున్ని సకాలంలో పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన డీసీపీ మురళీధర్, క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు, సీసీఎస్, కేయూసీ ఇన్స్‌పెక్టర్లు రమేశ్‌కుమార్, దయాకర్, ఎస్‌ఐ రాజేందర్, విజయ్‌కుమార్, ఏఏఓ సల్మాన్‌పాషా, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు వంశీ, చంద్రశేఖర్, సదానందం, ఎన్.శ్రీకాంత్, వినోద్, నర్సింహులు, నజీరుద్దీన్, ఐటీకోర్ కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు తదితరులను సీపీ రంగనాథ్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News