జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు
1కిలో బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: అత్తవారింట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన అల్లుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. 1 కిలో బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.65లక్షలు ఉంటుంది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మాణికేశ్వర్ నగర్‌కు చెందిన రంగమ్మ అలియాస్ జోగిని రంగమ్మ ఇంట్లో ఈనెల 1వ తేదీన చోరీ జరిగింది. ఇందులో వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలు కిలో, రూ.4లక్షల నగదు చోరీకి గురయింది. రంగారెడ్డి జిల్లా, తాళకొండపల్లి మండలం, ఖానాపూర్ గ్రామానికి చెందిన మందల లక్ష్మణ్ పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. జోగిని రంగమ్మ తను పెంచుకున్న కూతురితో లక్ష్మణ్‌కు వివాహం చేసింది.
మద్యం, సిగరేట్లు తాగడానికి బానిసగా మారిన నిందితుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే రంగమ్మ గత నెల 23వ తేదీన కాశీ యాత్రకు వెళ్లింది అదేసమయంలో అత్తవారింటిలో ఉన్న నిందితుడు ఇంట్లోని సిసి కెమెరాలను ఆఫ్ చేశాడు. ఇంట్లోని లాకర్‌ను పగులగొట్టి 105 తులాల బంగారు ఆభరణాలు, 12లక్షల నగదును చోరీ చేశాడు. కాశీ నుంచి వచ్చిన రంగమ్మ ఇంట్లో చోరీ జరగడంతో ఉస్మానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్, డిఎస్సై గంగాధర్ రెడ్డి తదితరులు దర్యాప్తు చేశారు.