అమాయకులను మోసం చేసిన నిందితుడు
రూ.25,65,000 బంగారు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: బ్లాక్ మ్యాజిక్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న నిందితుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.25,65,000 బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….యాదాద్రి జిల్లా, బిబినగర్ మండలం, జమీలాపేటకు చెందిన యరుకల బాలరాజు డిగ్రీ వరకు చదువుకుని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి మంత్రాలతో అన్నిసమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారవుతున్నాడు.
ఈ మధ్యలో ఆరుగురు అమాయకులను మోసం చేసి వారి వద్ద ఉన్న రూ.2,44,000 నగదు, 570 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల వద్ద నుంచి తీసుకున్న బంగారు ఆభరణాలను నిందితుడు కెఎల్‌ఎం, ముత్తూట్, ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కుదువ బెట్టాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఇలాగే మోసం చేయడంతో గతంలో ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై మార్కెట్ పిఎస్, ముషీరాబాద్, బషీర్‌బాద్, మాదాపూర్, ఘట్‌కేసర్ పిఎస్‌లో కేసులు ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం మార్కెట్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, పరమేశ్వర్ పట్టుకున్నారు.