తమిళనాడు రాజధాని చెన్నై లోని అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటన రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోంది. ఈ సంఘటనపై తాజాగా స్పందించిన డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని అంగీకరించారు. అయితే అతడు పార్టీలో సభ్యుడు కాదని, అతనికి తామెలాంటి రక్షణ కల్పించడం లేదని , మహిళల భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదైన కొన్నిగంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని,
ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రమేయం ఉన్నవారి నేపథ్యం ఎలా ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఎంకే నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల విషయంలో ఎంతో ఆలోచిస్తోందని, అందులో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణం , రూ. వెయ్యి ఆర్థిక సాయంతోపాటు ఉన్నత విద్యకు సంబంధించి పథకాలను అమలు చేస్తోందని స్టాలిన్ వివరించారు. ఈ కేసులో జ్ఞానశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.