పిస్తోల్, ఆరు తూటాలు స్వాధీనం
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమ ఆయుధం కలిగిన వ్యక్తిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పిస్తోల్, ఆరు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కెవి రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి రోషన్ కాలనీకి చెందిన మహ్మద్ హుస్సేన్ ఎల్‌బి నగర్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా పిస్తోల్, ఆరు తూటాలు లభించాయి. చార్మినార్‌కు చెందిన హుస్సేన్ అక్కడి నుంచి రాజేంద్రనగర్‌కు వచ్చి ఉంటున్నాడు. కూలీ పనిచేస్తుండడంతో వచ్చే డబ్బులు వ్యసనాలకు సరిపోకపోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిస్తోల్, రౌండ్లను కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. పిస్తోల్‌లో అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని, దోపిడీలు చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఓటి పోలీసులు ఎల్‌బి నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.