జైలుకు పంపించిందనే కక్షతో వివాహితపై గొడ్డలితో దాడి చేసిన వ్యక్తి
తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన మహిళ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన, పరారీలో నిందితుడు
మన తెలంగాణ/బాలాపూర్: తనపై కేసు పెట్టి జైలుకు పంపిందనే అక్కసుతో వివాహితపై ఓ యువకుడు గొడ్డలితో దాడికి పాల్పడిన సంఘటన మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్టెక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన చెరుకుపల్లి రాహుల్గౌడ్కు బాలాపూర్ మండలం, గుర్రంగూడ గ్రామానికి చెం దిన విమలకు గత రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని రాహుల్గౌడ్ను రవికుమార్, విమల దంపతులు 2020 సంవత్సరంలో మీర్పేట్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పొలీసు లు రాహుల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన రాహుల్‌గౌడ్ విమల వల్లే జైలుకు వెళ్లాననే కోపంతో సోమవారం సాయంత్రం ఆమె నివసించే గుర్రంగూడకు వచ్చి తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో చక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుండి పరారయ్యాడు. విమల కుటుంబ సభ్యులు, స్ధానికులు ఆమెను బిఎన్రెడ్డినగర్లోని నవీన ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా విమలకు కుడిచేయి భుజం వెనుక, మోచేయి, అరచేతలపై గాయాలై ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇన్స్పెక్టర్ తెలిపారు. రాహుల్ గౌడ్ కోసం 2 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలో అతన్ని అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.
Man attacked on girl with Axe in Abdullapurmet