భార్యపై అనుమానంతో ఆమె మేనమామపై భర్త హత్యాయత్నం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్ద అందరూ చూస్తుండగానే భార్య మేనమామపై భర్త తాను వెంట తెచ్చుకున్న కత్తితో హత్య చేసేందుకు నిందితుడు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి మడత రమేష్, ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డితో కలిసి నిందితుడి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. గోదావరిఖని వినోభానగర్‌లో నివాసముండే నంది శ్రీనివాస్‌పై వెంట తెచ్చుకున్న తల్వార్‌తో పొడిచి హత్యకు యత్నించిన మంచిర్యాల జిల్లా, బీమారంనకు చెందిన గొల్ల శ్రావణ్‌ను అరెస్ట్ చేశారు. గొల్ల శ్రావణ్‌కు ఆరేళ్ల క్రితం గోదావరిఖని వినోభానగర్‌కు చెందిన కాళ్ల పూజతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
గొల్ల శ్రావణ్‌కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యాభర్తల మధ్య గత సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తన మేనకోడలు పూజను ఎందుకు కొడుతున్నావని శ్రావణ్, అతని తల్లిదండ్రులను భీమారంలో కలిసి ఆమె మేనమామ నంది శ్రీనివాస్‌తో మాట్లాడాడు. పద్ధతి మార్చుకోవాలని శ్రావణ్‌కు సూచించాడు. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా వారం రోజుల క్రితం కూడా భార్యను కొట్టడంతో నంది శ్రీనివాస్, నంది నగేష్, కాళ్ల కిరణ్ భీమారంనకు వెళ్లి పూజను గోదావరిఖనికి తీసుకువచ్చారు. దీంతో పగ పెంచుకున్న శ్రావణ్ తన తల్లిదండులు గొల్ల నరేందర్, పద్మ, చిన్నమ్మలు వేద వరలక్ష్మి, పర్శ స్వప్న, అతని అమ్మమ్మ పర్శ బతుకమ్మ కుట్ర పన్ని, వారి ప్రోద్బలంతో ముందస్తుగా పథకం ప్రకారం మంగళవారం గోదావరిఖనిలోని వెంకటేశ్వర ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ వద్దకు వెళ్లి ఏదో మాట్లాడాలని బైక్‌పై ఎక్కించుకొని గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకువచ్చాడు. అప్పటికే శ్రావణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నంది శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడు శ్రీనివాస్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలింరు. నంది శ్రీనివాస్ సోదరుడు నగేష్ ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రావణ్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలించి నిందితుడు తప్పించుకొని బీమారం వైపు తన ఇంటికి వెళ్తుండగా చాకచక్యంగా స్థానిక గంగానగర్ బ్రిడ్జి వద్ద పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు తాను చేసి తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు, అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితునికి కఠినమైన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎసిపి తెలిపారు. ఈ కేసును కేవలం ఐదు గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.