మన తెలంగాణ/తాండూరు: తాండూరు మున్సిపల్ అధికారుల వేదింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది. తాండూరు పట్టణం దోబిగల్లికి చెందిన బిచ్చమ్మకు ఆరుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఆరుగురు కొడుకులకు కాకుండా కూతురుకు ఇల్లును తల్లి రాసిఇవ్వడంతో అన్నదమ్ములు అభ్యంతరం తెలిపారు. రెండ కొడుకు అయిన విద్యాసాగర్ తన ఇంటి పత్రాలు, మోటేషన్ పత్రాలు కావాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఏడాది నుంచి తిరుగుతున్నాడు. మేనేజర్ నరేందర్‌రెడ్డిని కలిసి ఎన్నో సార్లు పత్రాలు కావాలని ప్రాధేయపడ్డాడు. కొన్ని రోజులక్రితం రూ.3వేలు ఇచ్చినట్లు చెప్పాడు. మరో లక్ష రూపాయలు ఇస్తేనే పత్రాలు ఇస్తానని మేనేజర్ చెప్పినట్లు విద్యాసాగర్ చెప్పారు.
మంగళవారం ఉదయం వెళ్లి మేనేజర్ నరేందర్‌రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలో కలిసి తన ఇంటి పత్రాలను అడుగగా లక్ష రూపాయలు ఇవ్వు లేదంటే కాగితాలు లేవు పో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యాసాగర్ బయటకు వెళ్లి డబ్బలో పెట్రోల్ తీసుకుని వచ్చి మున్సిపల్ కార్యాలయంలోని మేనేజర్ చాంబర్‌లో తనపై పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మున్సిపల్ సిబ్బంది ఆయన వద్దనుంచి పెట్రోల్ డబ్బాను లాగుకున్నారు. వెంటనే తాండూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్ చెప్పిన మాటలను పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి బాధితునితో చెప్పి పంపారు. ఈ విషయంమై మేనేజర్ నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా తన కంటే ముందు ఉన్న అధికారుల వద్ద కాగితాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Man Attempt suicide as Municipal officers harassment in Vikarabad